KTR Support : ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యం కానీ నిరుపదే కుటుంబం. తల్లిదండ్రులు కూలీ పనిచేస్తే గానీ ఇళ్లు గడవని పరిస్థితి. అయినా అనుకున్నది సాధించాలనే తపనతో అడుగు ముందుకేసింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నీట్ లో మంచి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ కూడా సాధించింది. అయితే ఈ చదువుల సరస్వతికి లక్ష్మీ కటాక్షం లేకపోయింది. ఎంబీబీఎస్ అంటే లక్షలతో పని. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న ఆ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ నుంచి భరోసా అందించింది. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న ఆ విద్యార్థిని పరిస్థితి ఒకరు ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సాయం చేయడంలో అందరికన్నా ఒక అడుగు ముందుంటే మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆ పేద విద్యార్థిని చదువు పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 






నీట్ లో మంచి ర్యాంక్ 


నిర్మల్ జిల్లా కుబీర్‌ మండలం సిర్పెల్లి(హెచ్‌) గ్రామంలోని గాడేకర్‌ అమ్రాజీ-జైశీల దంపతుల కుమార్తె సంకీర్తన. వీరిది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం. సంకీర్తన తల్లిదండ్రులు కూలీ పనిచేస్తే గానీ ఇళ్లు గడవని పరిస్థితి. తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న సంకీర్తన.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంది.  4వ తరగతి వరకూ గ్రామంలో, 5 నుంచి 10వ తరగతి వరకు టీఎస్‌డబ్ల్యూ ఆర్‌జేసీ లెఫ్ట్‌ పోచంపాడులో, ఆదిలాబాద్‌ టీఎస్‌డబ్ల్యూ ఆర్‌జేసీలో ఇంటర్ పూర్తి చేసింది సంకీర్తన. ఇంటర్ లో 924 మార్కులు సాధించిన సంకీర్తన... వైద్య విద్య చదవాలనే ఉద్దేశంతో నీట్‌ పరీక్ష రాసింది. నీట్ లో మంచి ర్యాంక్ సాధించి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి మహిళా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ఎంబీబీఎస్ చదివేందుకు ఏడాదికి రూ.2.50 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుసుకుని దాతలు ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురుచూస్తుంది. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు ఎలా కట్టాలో తెలియక ఆవేదన చెందుతుంది.  


ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు


తమ కుమార్తె చదువుకు ప్రభుత్వం గానీ, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ గానీ ఆర్థికి సాయం చేయాలని సంకీర్తన తల్లిదండ్రులు వేడుకున్నారు. దాతలు ముందుకురావాలని సిర్పెల్లి గ్రామ సర్పంచ్‌ కూడా కోరారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి, కుబీర్ మండల ప్రజలకు తనవంతు సేవచేస్తానని సంకీర్తన అంటోంది. తన తల్లిదండ్రులు కష్టపడి ఇంత వరకు చదివించారని, అయితే వైద్య విద్య అంటే ఎంతో వ్యయం కూడికుందని అంత డబ్బు వాళ్లు కట్టలేరని ఆవేదన చెందుతుంది. దాతలు సాయం చేయాలని సంకీర్తన వేడుకుంటుంది.  తన బ్యాంక్‌ ఖాతా నంబర్‌ : 41478057957, IFSC CODE : SBIN0011084కు గానీ, ఫోన్‌ పే, గూగుల్‌ పే నంబర్‌ : 9505372490కు గానీ ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నది. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టిలో పడడంతో ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కేటీఆర్ ఆఫీస్ ఈ విషయం చూస్తుందని ట్విట్టర్ లో తెలిపారు.