Telangana News: 2021వ సంవత్సరానికి సంబంధించి ఆన్ లైన్ ఆర్థిక మోసాల నమోదులో తెలంగాణ ప్రథమంగా నిలిచింది. గత సంవత్సరం ఒక్క తెలంగాణలోనే 2003 కేసులు నమోదు అయ్యాని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిసి 14007 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలోనూ ప్రతి ఏటా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. లోక్ సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2010వ సంవత్సరంలో 282 కేసులు నమోదు కాగా.. 2020లో 3361కి కేసులు చేరుకోవడం గమనార్హం. 2019లో 172 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. 2020లో 582 మందిని, 2021లో 743 మంది ఆన్ లైన్ లో మోసగాళ్లని అరెస్ట్ చేసినట్లు వివరించింది. శిక్షల్లో మాత్రం భారీ తేడా ఉందని కేంద్రం వెల్లడించింది. అలాగే 2010లో ఇద్దరికి, 2020లో 202 మందికి, 2021లో 3 కేసుల్లో మాత్రమే శిక్షలు పడినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 


పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ ఆశలు..


పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదట వాట్సాప్, ఫేస్ బుక్, టెక్స్ట్ మెసేజెస్ చేస్తూ.. అమాయకులు ఆకర్షితులయ్యేలా చేస్తారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట ఇంట్లో కూర్చుని రోజుకి 10,000 నుంచి 25,000 వేల వరకూ సంపాదించడంటూ మెస్సేజెస్ చేస్తారు. ఒక్కసారి మనం ఆ లింక్ ను క్లిక్ చేసినా, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినా ఇక మన పని అయిపపోనట్టే. అలా రోజుకి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు దాదాపు 20 నుంచి 30 వరకు కేసులు వస్తున్నాయంటే మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే లక్ష రూపాయలు దాటితేనే ఫిర్యాదు చేసేందుకు బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. లక్షకు తక్కువ జరిగిన ఫిర్యాదులు స్థానిక పోలీస్ స్టేషన్ లోనే నమోదవుతాయి. దీని బట్టి రోజుకి కనీసం వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్న మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారు పరువు కోసమో లేదా కొంత డబ్బే కదా అని ఫిర్యాదు కూడా చేయడం లేదు. 


ముక్కూ, మొహం తెలియని వాళ్లకు అస్సలే డబ్బు పంపించొద్దు..


లాకే డౌన్ తరవాత ఇటువంటి మోసాల సంఖ్య అధికమైంది. ఎప్పుడైనా, ఎవరైనా సరే ఉద్యోగం పేరుతో డబ్బు అడిగితే అది కచ్చితంగా మోసపురితం అని గ్రహించాలి. అదే విదంగా ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఒకసారి డబ్బు కట్టాక.. మళ్లీ మళ్లీ పెద్ద మోతాదులో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమని అడిగితే మీరు మోసపోతున్నట్లు గుర్తించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులను, హౌస్ ఫైవ్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం పేరుతో మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముక్కూ, మొహం తెలియని వాళ్లకు డబ్బులు పంపించకూడదని పేర్కొంటున్నారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. అప్పుడే ఇలాంటి మోసాలను అడ్డుకోగలం అని తెలిపారు. ముఖ్యంగా యువత ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి మోసాలకు గురవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.