Hyderabad: మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Gowtham Reddy) మరణంపై అపోలో హాస్పిటల్ డాక్టర్లు స్పందించారు. నేడు (ఫిబ్రవరి 21) ఉదయం 9.16 గంటలకు గౌతమ్‌రెడ్డి మృతిచెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘‘గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్ రెడ్డిని ఆస్పత్రిని తీసుకువచ్చారు. స్పందించని స్థితిలో గౌతమ్ రెడ్డిని తీసుకొని వచ్చారు. ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే శ్వాస ఆడట్లేదు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు.’’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ డాక్టర్లు కలిసి మంత్రికి 90 నిమిషాలకు పైగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ - సీపీఆర్ (Cardiopulmonary resuscitation) ప్రక్రియ చేశారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.
సీపీఆర్ అంటే..
సీపీఆర్‌గా పిలిచే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (Cardiopulmonary resuscitation) అనేది ప్రాణాలను రక్షించే ఒక టెక్నిక్. ఇది గుండె పోటు లేదా నీటిలో మునిగిపోవడం వంటి అనేక అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఎవరికైనా శ్వాస తీసుకోవడం లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయిన సందర్భంలో సీపీఆర్ (CPR) చేయాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. గట్టిగా, వేగంగా ఛాతిపై ఒత్తిడి కలగజేయడం ద్వారా సీపీఆర్‌ని ప్రారంభించాలని సూచించింది. గుండె పోటు వచ్చి శ్వాస ఆడని సమయంలో కార్డియో పల్మోనరీ రిససిటేషన్ చాలా కీలకం. గుండెను మళ్లీ కొట్టుకొనేలా చేసే ప్రయత్నమే సీపీఆర్. గుండె పనిచేయడం ఆగిపోవడంతో శరీర భాగాలకు నిలిచిపోయిన రక్త సరఫరాను తిరిగి పంపిణీ చేయడమే. ఇందుకోసం ఆపదలో ఉన్న వ్యక్తి ఛాతి మీద చేతులతో ఒత్తిడి కలిగించి గుండె కొట్టుకునేలా చేస్తారు. దానితోనూ ఫలితం లేకపోతే ప్రత్యేకమైన యంత్రాల సాయంతో సీపీఆర్ చేస్తారు.
హైదరాబాద్‌లోని ఇంటికి మంత్రి భౌతిక కాయం
జూబ్లీహిల్స్ లోని నివాసానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలించారు. సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ లోని నివాసంలోనే అభిమానుల సందర్శనార్ధం గౌతమ్ రెడ్డి భౌతికకాయం ఉండనుంది. రేపు నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రేపటికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లుండి నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Also Read: In Pics: మేకపాటి చివరి పర్యటన ఇదే, దుబాయ్‌లో ప్రముఖులతో - ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు