ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయనకి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా వైద్యులు సోమవారం ఉదయం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన వయసు 49 సంవత్సరాలు మాత్రమే. మంత్రి చనిపోయిన విషయాన్ని అపోలో వైద్యులు ఆయన భార్యకు ఫోన్ చేసి తెలిపారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


మేకపాటి రెండ్రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోకి వెళ్లారు. నిన్ననే (ఫిబ్రవరి 21) తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన వెంటనే ఆయనకు అస్వస్థత కలిగింది. ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుతో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచారు. మేకపాటికి ఇప్పటికే రెండుసార్లు కరోనా సోకింది. పోస్ట్ కొవిడ్ లక్షణాలు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చేందుకు దారి తీశాయా అని అనుమానిస్తున్నారు.


నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతం రెడ్డి. 1971 నవంబరు నవంబరు 2న గౌతం రెడ్డి జన్మించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం. ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మేకపాటి ఎంఎస్సీ (టెక్స్‌టైల్స్) పట్టా పొందారు. 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అదే సంవత్సరం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2019 ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావడంతో ఆయన్ను మంత్రి పదవి వరించింది. 


మేకపాటి గౌతం రెడ్డికి రాజకీయాల్లో చాలా మృదుస్వభావిగా మంచి పేరుంది. ప్రత్యర్థి పార్టీల వారు ఎంతగా రెచ్చగొట్టేలా మాట్లాడినా మేకపాటి మాత్రం సున్నితంగా స్పందించేవారు. అందరితో చాలా సన్నిహితంగా ఉంటారని తోటి నాయకులు చెబుతూ ఉంటారు.


మంత్రులు, వైసీపీ శ్రేణుల దిగ్భ్రాంతి


మేకపాటి గౌతం రెడ్డి చనిపోయిన వార్తను తెలుసుకొని వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతి చెందారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు నాయకులు అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు.