Jubilee Hills: ఏపీలో ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగిన నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఇక లేరనే విషయం తెలుసుకొని తాను దిగ్భ్రాంతి చెందానని అన్నారు. ఈ సమయంలో తనకే చాలా బాధ కలుగుతోందని, అలాంటిది తన కుటుంబ సభ్యులు ఎంతటి వేదన అనుభవిస్తున్నారో అని అన్నారు. వారికి ధైర్యంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మేకపాటి తనకు గత 15 ఏళ్లుగా తెలుసని గుర్తు చేసుకున్నారు. గౌతం రెడ్డి తండ్రితో తాను మాట్లాడానని అన్నారు. ఇలాంటి దిగ్ర్భాంతికర సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని భరోసా కల్పించినట్లుగా మంత్రి కేటీఆర్ చెప్పారు.


మేకపాటి భౌతిక కాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 46లోని మేకపాటి ఇంటికి తరలించిన అనంతరం మంత్రి కేటీఆర్ వారి ఇంటికి వెళ్లారు. అక్కడ ఏపీ మంత్రి భౌతిక కాయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో మాట్లాడి ఓదార్చారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బయటికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు.


చంద్రబాబు నివాళులు
కాసేపటికి టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు నివాళి అర్పించారు. ఆయన ఆకస్మిక మరణం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఉదయం జిమ్‌కు వెళ్లాల్సిన ఆయన అస్వస్థతకు గురయ్యారని అన్నారు. మేకపాటి తండ్రి రాజమోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి తాను చూస్తున్నానని అన్నారు. ఎంతో హుందాగా వారి రాజకీయాలు ఉండేవని అన్నారు. గౌతమ్ రెడ్డి చాలా తక్కువ సమయంలో ఎమ్మెల్యే అయ్యారని, మంత్రి కూడా అయ్యారని అన్నారు. చాలా హూందాగా గౌతమ్ రెడ్డి రాజకీయాలు చేస్తారని అన్నారు. ఇదొక డెస్టినీ అని.. దీన్ని ఎవరూ నివారించలేరనేందుకు ఇదొక ఉదాహరణ అని అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.