మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాలు జరిగాయంటూ సంస్థ యాజమాన్యానికి ఏపీ సీఐడీ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శైలజా కిరణ్ నివాసంలో శైలజతో పాటు, రామోజీరావును కూడా ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఏ - 1గా రామోజీరావు, ఏ - 2గా శైలజా కిరణ్‌, మా­ర్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచీల మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.




మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ గత నెల 28న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. మార్చి 29, 31 లేదా ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో ఎప్పుడైనా సీఐడీ విచారణకు రావాలని  తెలిపారు. విచారణ వాళ్ల నివాసంలో కానీ, ఆఫీస్‌లో కానీ హాజరుకావాలని ఆదేశించారు. 


మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దూకుడుగా ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని కేసులు నమోదు చేసిన సీఐడీ ఇప్పుడు రామోజీరావు, శైలజకు నోటీసులు ఇవ్వడం, విచారణ చేస్తుండడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ  కేసులో నలుగురిని అరెస్టు చేసింది వాళ్లంతా బెయిల్‌పై విడుదలయ్యారు. 


ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సోదాలు చేసింది. మార్గదర్శి సంస్థలో నిబంధలు ఉల్లంఘనలు బయటపడ్డాయని ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలు ఉల్లంఘించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొంత కాలంగా మార్గదర్శి చిట్ ఫండ్స్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విచారణ  సందర్భంగా మార్గదర్శి శాఖల్లో పనిచేస్తున్న కామినేని రామకృష్ణ (సీతమ్మధార), సత్తి రవిశంకర్ (రాజమండ్రి), శ్రీనివాసరావు(లబ్బీపేట), గొరిజవోలు శివరామకృష్ణ(గుంటూరు)ను అరెస్టు చేసింది. తర్వాత వాళ్లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 


మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇండివిడ్యువల్‌ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్‌ సమర్పించలేదని, బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి అందజేయలేదని అధికారులు తెలిపారు. మూడు నెలలుగా మార్గదర్శికి చెందిన 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను నిలిపివేశారని తెలిపారు. డిసెంబర్‌ నుంచి ఈ ఫారం నింపి ఇవ్వలేదంటున్నారు. 


ఎఫ్ఐఆర్ లో రామోజీరావు,  శైలజా కిరణ్ పేర్లు


మొత్తం మూడు చట్టాల  కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్  34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982  లోని సెక్షన్   76,79 ప్రకారం  ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది. ఇందులో ఇన్వెస్టింగేటింగ్ అధారిటీగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉందని సీఐడీ ఓ ప్రకటనలో తెలిపింది. నమోదైన ఎఫ్ఐఆర్‌లలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్,  అలాగే ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్,  అలాగే ఆయా బ్రాంచీల మేనేజర్ల పేర్లను చేర్చారు. ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయన్న విషయాన్ని సీఐడీ తన ప్రకటనలో తెలియచేయలేదు.