టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు బయటికి వస్తున్నాయి. ఏఈ పేపర్ లీక్ లో రాజేశ్వర్ అనే వ్యక్తి కీలక పాత్ర వహించగా, దాన్ని అతను ఏకంగా రూ.40 లక్షలకు ఇతరులకు విక్రయించినట్లుగా తెలిసింది. అడ్వాన్స్ రూపంలో రూ.25 లక్షలను ముందే తీసుకున్నాడని, రిజల్ట్స్ వచ్చాక మిగతా డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తులో భాగంగా ఈ వివరాలు బయటికి వచ్చాయి. ఈ డబ్బులో నుంచి రూ.8 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ రేణుకకు రూ.10 లక్షలకు పేపర్ విక్రయించి అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు తీసుకున్నట్లుగా గుర్తించారు. రేణుక భర్త డాక్యానాయక్.. తన బంధువు రాజేశ్వర్‌కు ఈ విషయం చెప్పాడు. అంతేకాక, గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్ కు రాజేశ్వర్.. ఏఈ పేపర్‌ను రూ.40 లక్షలకు అమ్మాడు. 


ముందుగా తీసుకున్న 23 లక్షల అడ్వాన్స్‌లో రూ.10 లక్షలను డాక్యా నాయక్‌కు నిందితుడు రాజేశ్వర్ ఇచ్చాడు. గతంలో ఈ రాజేశ్వర్ తన గ్రామంలో చిట్టీల వ్యాపారం కూడా చేసేవాడు. రాజేశ్వర్ తల్లి మహబూబ్ నగర్‌ జిల్లా గండ్వీడ్ మండలం మన్సూర్ పల్లి తండా సర్పంచ్. పేపర్ లీక్ చేయగా వచ్చిన 8 లక్షలతో రాజేశ్వర్ తల్లి తన సొంత గ్రామంలో అభివృద్ధి పనులు చేయించింది. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరైన తర్వాత డబ్బులు తిరిగి తీసుకుందామని రాజేశ్వర్ అనుకున్నట్లుగా పోలీసులు గర్తించారు. కానీ, ఇంతలోనే కుంభకోణం విషయం బట్టబయలు అయింది.