Jogi Ramesh Visits Neera Cafe in Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు జోగి రాజీవ్ సందర్శించారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను తెలంగాణ సర్కార్ అందిస్తోందని ప్రశంసించారు.
నీరా టేస్ట్ చేసిన ఏపీ మంత్రి జోగి రమేష్
ఈ నీరా కేఫ్ ను సందర్శించడానికి విచ్చిన మంత్రి జోగి రమేష్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. మంత్రి జోగి రమేష్ కి ఈ నీరా కేఫ్ లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. అందరూ కలిసి నీరా టేస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ మంత్రులతోపాటు సినీ నటుడు తల్వార్ సుమన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజా ప్రతినిధులు నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
మే 3న హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. నీరా కేఫ్ ను ప్రారంభించారు. అనంతరం స్వామీజీలతో కలసి వేదికపై నీరా పానియాన్ని సేవించారు. నీరాలో సున్నా శాతం ఆల్కహాల్ ఉంటుందని.. ఇది హానికరమైన పానియం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నీరా పానియంపై ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని.. వీలైనంత వరకు దీన్ని ప్రతిరోజూ తాగాలని సూచించారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇతర డ్రింక్స్ కంటే దీన్ని తాగడం మేలని చెప్పారు.
రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్నట్లుగానే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ట్విట్టర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కల్లుగీస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వివరించారు.