హైదరాబాద్‌లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ నిర్మించ తలపెట్టిన ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మెట్రోకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ టెండర్లను పిలిచింది. రేపటి నుంచి (మే 17) బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ తెలిపింది. ఈ బిడ్డింగ్ కు జులై 5ను చివరి తేదీగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్టు విలువ రూ.5,688 కోట్లుగా మెట్రో రైల్ లిమిటెడ్ నిర్ధారించింది.
ఈ ఏడాది సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. సర్వే చేయడం, తాజాగా ఇప్పుడు టెండర్లు పిలవడంతో ఈ ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌తో ఉంది.
హైదరాబాద్ నుంచి విమానాశ్రయానికి చేరుకోడానికి ఇప్పటికే మెరుగైన రహదారి మార్గం ఉంది. ఆర్టీసీ పుష్పక్ బస్సులను నడుపుతోంది. మరింత సులువుగా హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకి చేరుకునేలా మెట్రో రెండో దశ 2018లో తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2018 మార్చిలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు ఏ మార్గాలు, ప్రాంతాల మీదుగా వెళుతుందనే వివరాలను కూడా రూపొందించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కిమీ మార్గానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ డీపీఆర్ ను రూపొందించింది. అయితే, నిధుల లేమి వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలకెక్కలేదు. అయితే, ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ రెండోదశ మెట్రోకు నిధులు కేటాయించడంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకుంది. అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలనే ఉద్దేశంతో ఎయిర్ పోర్టుకు ఈ మెట్రోను నిర్మిస్తున్నారు.
ప్రస్తుత మెట్రో కన్నా అధిక సౌకర్యాలు
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి 900 మీటర్లు దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్ పోర్టు మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇక్కడితో ఎయిర్ పోర్టు మెట్రో రైలు ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ కాజాగూడ చెరువు పక్కనుంచి నానక్‌రాంగూడ జంక్షన్ అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ పక్కగా, నార్సింగి అప్పా జంక్షన్, రాజేంద్రనగర్ శంషాబాద్ విమానాశ్రయ కార్గో మీదుగా ఎయిర్ పోర్టులోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్ సమన్వయంతో డిజైన్లు రూపొందించారు. ఈ ఎయిర్ పోర్టు మెట్రోలో, నగరంలో తిరుగుతున్న మెట్రో కన్నా మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు. ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా ఛైర్‌కార్ సీట్లు ఉంటాయి. ప్లాట్‌ఫాంపై భద్రత కోసం విదేశాల్లో మాదిరిగా అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. లైట్ వెయిట్ స్టెయిన్ లెస్ స్టీల్ అల్యూమినియం కోచ్‌లు ఉంటాయి. మలుపుల్లో కూడా మెట్రో రైళ్లు వేగంగా వెళ్లడానికి వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. మెట్రో స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే ఎల్ఈడీ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. సీఐఎస్‌ఎఫ్ పోలీసుల నిర్వహణలో భాగంగా లగేజీ చెకింగ్ కూడా చేస్తారు.