Amit Shah Meets Ramoji Rao:  తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. తన పర్యటనలో భాగంగా రామోజీ గ్రూప్ అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ ఫౌండర్ రామోజీరావుతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన సభ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు అమిత్ షా. కేంద్ర మంత్రికి రామోజీరావు స్వాగతం పలకడంతో పాటు తన నివాసానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ రామోజీరావు, అమిత్ షాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదని, మర్యాదపూర్వకంగా ఇద్దరు ప్రముఖులు కలిశారని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. రామోజీరావుతో షా భేటీలో పొత్తుల గురించి చర్చ జరిగిందా, మీడియా సహాయం కోరేందుకు భేటీ అయ్యారా అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.   






45 నిమిషాల పాటు ఫిల్మ్ సిటీలో అమిత్ షా 
హోంమంత్రి అమిత్ షాది బిజీ షెడ్యూల్‌తో మధ్యాహ్నం  మూడున్నరకు హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. అక్కడి నుంచి మునుగోడుకు వెళ్లారు. అక్కడ పార్టీ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం.. రామోజీ ఫిల్మ్ సిటీకి అమిత్ షా చేరుకున్నారు. అమిత్ షా దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఫిల్మ్ సిటీలో గడిపారు. రామోజీరావు కేంద్ర మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికి ఇంటికి ఆహ్వానించగా.. అక్కడ పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. గతంలో హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సమయంలో రామోజీరావును కలిశారు అమిత్ షా. ఈ సారి కూడా ఆయనతో భేటీ కోసం ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అయితే ఇది రాజకీయాలకు సంబంధించిన సమావేశం కాదని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. ఫిల్మ్ సిటీ నుంచి అమిత్ షా శంషాబాద్ నోవా టెల్ కు బయలుదేరారు. 


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రశ్నాస్త్రాలు..
అసలే కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం పొసగడం లేదు. రైతులకు పంట మద్దతు ధర, నూతన వ్యవసాయ చట్టాలు లాంటి అంశాలతో పాటు పలు విషయాల్లో కేంద్రం తీరును కేసీఆర్ ఎండగట్టారు. దాంతో ఇదే సమయం అనుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడ వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రశ్నాస్త్రాలు సంధించారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఇంకా ఎందుకు నెరవేర్చలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీలో చేరిన తమ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడ ప్రజలను కోరారు. సెప్టెంబర్ 17ను వియోచన దినోత్సవంగా జరుపుతామని ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు అమిత్ షా. మూడు వేలు నిరుద్యోగభృతి, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇల్లులు ఇచ్చారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 


డెవలప్ కావాంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి..
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించి డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలని అమిత్ షా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే.. అదే తమ విజయానికి నాంది పలుకుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా, తెలంగాణ ప్రభుత్వం ధరలు తగ్గించలేదని మునుగోడు సభలో అమిత్ షా గుర్తుచేశారు.