మునుగోడు వేదికపై కేసీఆర్ విసిరిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు కానీ... తెలంగాణ ప్రజలకు మాత్రం వేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఉద్యమం సమయంలో, ఎన్నికల మేనిఫెస్టో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తూ సాగింది అమిత్‌షా ప్రసంగం. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న అమిత్‌షా... రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే బీజేపీలో చేరడం లేదన్న అమిత్‌షా... కేసీఆర్ పార్టీని కూకటివేళ్లతో పెకలించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్‌ను పడగొట్టేందుకు బీజేపీతో చేతులు కలిపారని వివరించారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే... పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుందన్నారు.
తెలంగాణ ఏర్పడితే...సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు అమిత్‌షా. రజాకార్లు ఉగ్రవాదంతో తెలంగాణ ప్రజలపై అత్యాచారం చేశారని గుర్తు చేశారు. దానికి వ్యతిరేకంగా విమోచన దినం జపుతామని కేసీఆర్ చెప్పారని ఇప్పుడు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మజ్లీస్‌కు భయపడి తెలంగాణ విమోచన దినం జరపడం లేదని విమర్శించారు అమిత్‌షా. ఈ మునుగోడు నుంచి మాట ఇస్తున్నానని... బీజేపీ ముఖ్యమంత్రి వస్తే... తెలంగాణ విమోచన దినం జరుపుతామని హామీ ఇచ్చారు.
మూడు వేలు నిరుద్యోభృతి ఇస్తామన్నారు.. ఏమైందని నిలదీశారు అమిత్‌షా. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇస్తామన్నారు.. ఆ హామీ సంగతి చెప్పాలన్నారు. నల్గొండకు ఆసుపత్రి వచ్చిందా అని ప్రజలను అడిగారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మోసం చేశారన్నారు. ఇల్లు ఇవ్వకపోగా మోదీ ఇచ్చే టాయిలెట్ కూడా రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారని గుర్తు చేసిన అమిత్‌షా. ఎనిమిదేళ్లు అయినా ఆ హామీ సంగతే పట్టించుకోలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే... సీఎంగా కేసీఆర్ కాదు.. కేటీఆర్ కూర్చుంటారని అభిప్రాయపడ్డారు. గిరిజనులకు కూడా భూమి ఇస్తామన్నారు ఇచ్చారా అని ప్రజలను ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... గత ఎనిమిదేళ్లలో యువకులకు ఎక్కడా ఉపాధి ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారని ఆరోపించారు.
రైతులను కూడా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆక్షేపించారు అమిత్‌షా. కిసాన్ బీమా యోజన అమలు చేయనందు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అంతేకాకుండా పండిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు రైతు పండించిన ప్రతి కిలో ధాన్యం కొంటామని మాట ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నా తమకు సమస్య లేదన్న అమిత్‌షా.. ఆ కారణంగా ప్రజలు నష్టపోతే మాత్రం ప్రశ్నిస్తుంటామన్నారు. వాళ్ల కోసం ప్రజలు ఎందకు నష్టపోవాలా అని అడిగారు. కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందన్నారు. అధిక ధరలు దేశంలో తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని... దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపారు. రెండు సార్లు మోదీ ప్రభుత్వం పెట్రోలు ధరలు తగ్గిస్తే కేసీఆర్ ఒక్కసారి కూడా తగ్గించలేదని గుర్తు చేశారు. దాని వల్లే నిత్యవసరాల రేట్లు పెరిగిపోతున్నాయన్నారు.
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని... రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ఒకసారి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే... దేశంలో అభివృద్ధి చెందుతున్నట్టే రాష్ట్రం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు అమిత్‌షా. మోదీకి సహకరిస్తారా... రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తారా... తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తారా... తెలంగాణలో కమలాన్ని వికసించడం కోసం పని చేస్తారా.. అని ప్రజలను ప్రశ్నించారు. సభకు వచ్చిన ప్రజలు కూడా సహకరిస్తామంటూ మాట ఇచ్చారు.