Hyderabad Airport Metro: హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో సంస్థ అలైన్ మెంట్ ఖరారు చేసింది. అలాగే క్షేత్రస్థాయి డేటా సేకరణ పనుల కోసం రెండు సర్వే బృందాలను హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో సంస్థ ఏర్పాటు చేసింది. మెట్రో స్తంభాలు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, ఎక్కడ ఎంత ఎత్తు ఉండాలనే విషయంలో ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై డేటాను కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ డేటా కీలకంగా మారింది.


రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక అనుగుణంగా బృందాలు క్షేత్ర స్థాయిలో సర్వే చేయనున్నాయి. ఈ క్రమంలోనే అదివారం ఎయిర్ పోర్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సర్వేను ప్రారంభించారు. ఇంజినీర్లతో కలిసి రాయదుర్గ్ నుంచి నార్సింగి కూడలి వరకు ప్రతిపాదిత మెట్రో వర్గాన్ని పరిశీలించారు. 10 కిలో మీటర్ల పొడవున కాలి నడకను పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. 


వారికే కాదు శివార్లలో ఉండే వాళ్లకు కూడా..!


విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే కాకుండా మెట్రో కారిడార్ వెంట ఉండే ప్రాంత వాసులకు, శివార్లలో ఉండే వాళ్లకు కూడా ఉపయోగపడేలా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారని ఎండీ వివరించారు. అమీర్ పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్ మాదిరి నాలుగు అంతస్తుల్లో రాయదుర్గ్ లో విమానాశ్రయ మెట్రో స్టేషన్ రాబోతుందని తెలిపారు. కింద రెండు అంతస్తులను కొత్త లైన్ విమానాశ్రయ మెట్రో స్టేషన్ కు, పైన రెండు అంతస్తులను పాత కారిడార్-3, కారిడార్ పొడగింపు స్టేషన్ల కోసం వినియోగించనున్నారు. దీని కోసం ఐకియా భవనం తర్వాత, ఎల్ అండ్ టీ, అరబిందో భవనాల ముందు ఒకదానిపై రెండే స్టేషన్లు నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సర్వే బృందాలకు సూచించారు. పక్కనే ఉన్న ట్రాన్స్ కో 400 కేవీ విద్యుత్తు ఉపకేంద్రానికి సంబంధించిన భూగర్భ కేబుళ్లను మార్చాలంటే ఎక్కువ ఖర్చు, సమయం పడుతుందని వివరించారు. అందుకే ఎలాంటి అవసరం లేకుండా ప్రవేశ మార్లాలు ఉండాలని సూచించారు. 


భవిష్యత్తులో నిర్మించబోయే వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి..!


బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లను ఆనుకొని మెట్రో స్తంభాల నిర్మాణం ఉండేలా చూడాలని.. ట్రాఫిక్ కు అంతరాయ లేకుండా చూడాలని అన్నారు. భవిష్యత్తులో నిర్మించే బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మెట్రో కారిడార్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. నానక్ రాంగూడ కూడలి వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణానికి సంబంధించి చుట్టు పక్కల కాలనీలు, వాణిజ్య కేంద్రాల నుంచి కాకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. పార్కింగ్ కోసం సమీపంలో ఖాళీ ప్రభుత్వ భూములను పరిశీలించాలని వివరించారు. ఎండీ వెంటే చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్  ప్రాజెక్టు మేనేజర్ బి. ఆనంద మోహన్, జీఎంలు ఎం. విష్ణు వర్ధన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.