Sangareddy News : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణం జరిగింది. జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ లో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ బావిలోకి దూకి భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. మృతులు రాజగిరి వెంకట్, రాజగిరి లక్ష్మీగా పోలీసులు గుర్తించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిరాగ్ పల్లి పోలీసులు బావిలోంచి మృతదేహాలను వెలికితీత చర్యలు చేపట్టారు.  


రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి 


జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వాంతాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. మృతులు కొడిమ్యాల మండలానికి చెందిన వెంకటేశ్‌, లక్ష్మినారాయణగా గుర్తించారు. ఆ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న మల్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


కోనసీమ జిల్లాలో దంపతులు ఆత్మహత్య 


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. భార్యను అనారోగ్య సమస్యలు వేధించగా.. అది భరించలేని ఆమె ఉరి వేసుకొని చనిపోయింది. భార్య చనిపోయిన విషయం గుర్తించిన భర్త అది తట్టుకోలేక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు దంపతులు ఇద్దరూ చనిపోవడం జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  అమలాపురం కొంకాపల్లికి చెందిన 47 ఏళ్ల బోనం విజయ్‌ కుమార్‌ స్థానికంగా హిమ్మత్‌ సాఫ్ట్ డ్రింక్‌ తయారీ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. చాలా ఏళ్ల నుంచి అమలాపురంలో మంచి వ్యాపార కుటుంబంగా వీరికి పేరుంది. విజయ్‌ కుమార్‌ భార్యకు మెదడుకు సంబందించి ఇటీవలే శస్త్ర చికిత్స జరిగింది. అయినా ఆమె ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడటం లేదు. దీని గురించి ఆమె ఎప్పుడూ మదన పడుతూనే ఉండేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి విజయ్‌ కుమార్‌ భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భార్య మృతితో విజయ్‌ కుమార్‌ కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆమె లేని లోకంలో తాను ఉండలేని భావించాడు. 


గుండెపగిలే బాధలోనే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. దీంతో విజయ్‌ కుమార్‌ కూడా మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకప్పుడు అమలాపురంలో ఫేమస్‌ అయిన హిమ్మత్‌ కూల్‌ డ్రింక్‌ తయారీ కొంకాపల్లిలో ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించారు. కాలక్రమంలో ఇది కాస్త మూతపడే పరిస్థితి తలెత్తింది. అమలాపురంలో గ్రీన్‌ లాండ్‌ పేరుతో మొదటి త్రీష్టార్‌ హోటల్‌ నిర్వహించారు. అయితే అదికూడా నష్టాల్లోకి వెళ్లడంతో దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంత కాలంగా చిన్న చిన్న కాంట్రాక్టులు చేపడుతున్నప్పటికీ అవికూడా సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు చాలవన్నట్లు అనారోగ్య సమస్యలు కూడా వేధించడంతో బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది.