IND vs BAN, 1st Test: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్సులో బంగ్లా 324 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో టీమిండియా 2 మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 8 వికెట్లు, 40 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
విజయానంతరం భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడాడు. ఈ విజయం తమకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపాడు. రాబోయే టెస్టులో కూడా ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తామని చెప్పాడు.
'గత కొంతకాలంగా మేం బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నాం. వన్డే సిరీస్ మేం కోరుకున్నట్లు సాగలేదు. ఫలితాలు మేం అనుకున్నట్లుగా రాలేదు. కాబట్టి టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన చేయాలనుకున్నాం. అనుకున్నట్లుగానే తొలి టెస్టులో విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఈ పిచ్ ఫ్లాట్ గా ఉంది. తొలి 3 రోజులు బ్యాటింగ్ చేయడం కష్టమైంది. అయినప్పటికీ 48 పరుగులకు 3 వికెట్ల కోల్పోయిన స్థితి నుంచి మేం 404 పరుగులు చేశాం. పుజారా, శ్రేయస్ చాలా బాగా ఆడారు. గిల్, పంత్ లు రాణించారు. అలాగే బౌలర్లు మమ్మల్ని పటిష్ట స్థితిలో నిలిపారు. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ ఫ్లాట్ గా మారడం మాకు ఆందోళన కలిగించలేదు. అయితే ప్రత్యర్థి బ్యాటర్లు సులువుగా పరుగులు చేస్తున్నారనిపించింది. బంగ్లా ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన విధానం చూసి మేం వికెట్ల కోసం చాలా కష్టపడాలని అర్ధమైంది. టెస్ట్ మ్యాచ్ అంటే ఇలానే ఉంటుందని మాకు తెలుసు. ఉమేష్ యాదవ్ తొలి వికెట్ తీసినప్పుడు మాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. పిచ్ నుంచి సరైన సహకారం లేకున్నా మా బౌలర్లు 20 వికెట్లు పడగొట్టారు. తమలో ఎంత నాణ్యత ఉందో చూపించారు.' అని కేఎల్ రాహుల్ అన్నాడు.
రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటామని.. ఆ తర్వాత రెండో టెస్టుకు సిద్ధమవుతామని రాహుల్ చెప్పాడు.