AUS vs SA 1st Test:
ఆస్ట్రేలియా క్రికెట్‌పై టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు! కనీసం రెండు రోజులైనా ఆట వీలవ్వని పిచ్‌లు తయారు చేసిందని విమర్శించాడు. ఇలాంటిదే భారత్‌లో చోటు చేసుకుంటే టెస్టు క్రికెట్ అంతమైపోయినట్టు మాట్లాడేవారని పంచ్ ఇచ్చాడు. వారి వంచనకు మైండ్ బద్దలవుతోందని వెల్లడించాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. బ్రిస్బేన్‌లో తొలి టెస్టు ఆడింది. ఈ మ్యాచ్ కనీసం రెండు రోజులైనా జరగలేదు. 142 ఓవర్లకే ఆట ముగిసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్సులో 48.2 ఓవర్లకు 152కు ఆలౌటైంది. తెంబా బవుమా (30), కైల్ వెరియెన్ (64) టాప్ స్కోరర్లు. మిగతా వాళ్లు 10 పరుగుల మార్క్ దాటలేదు. మిచెల్ స్టార్క్, నేథన్ లైయన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. బదులుగా బ్యాటింగ్ చేసిన కంగారూ టీమ్ 50.3 ఓవర్లకు 218 పరుగులకు పరిమితమైంది. ట్రావిస్ హెడ్ (92) టాప్ స్కోరర్. అతను ఆడకుంటే ఇంకా తక్కువ స్కోరుకే కుప్పకూలేది.
ఇక రెండో ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా మరింత పేలవంగా ఆడింది. 37.4 ఓవర్లకు 99 రన్సే చేసింది. తెంబా బవుమా (29), కాయా జొండొ (36) టాప్ స్కోరర్లు. ప్యాట్ కమిన్స్ 5 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, బొలాండ్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా 34 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7.5 ఓవర్లకే విజయం అందుకుంది. అయితే 4 వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్‌కు వచ్చిన ఆరుగురిలో ఒక్కరి స్కోరైనా 6 దాటలేదు. కాగిసో రబాడా 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టాడు.
సాధారణంగా భారత్‌లో స్పిన్ పిచ్‌లు రూపొందిస్తే ఆస్ట్రేలియా సహా అన్ని జట్లూ ఇబ్బంది పడతాయి. బ్యాటింగ్ చేయలేక కుప్పకూలుతాయి. అలాంటప్పుడు సరైన టెస్టు క్రికెట్ పిచ్ రూపొందించలేదని, ఇలాగైతే సుదీర్ఘ ఫార్మాట్ అంతరించి పోతోందంటూ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు ఆసీస్‌లో ఇలాగే జరిగితే ఎవరూ స్పందించడం లేదని సెహ్వాగ్ పంచ్ ఇచ్చాడు.
'142 ఓవర్లు. కనీసం రెండు రోజులైనా ఆట సాగలేదు. కానీ ప్రతిసారీ ఎలాంటి పిచ్‌లు అవసరమో లెక్చర్లు దంచడం వారికి అలవాటు. ఇదే భారత్‌లో చోటు చేసుకుంటే టెస్టు క్రికెట్ అంతమైనట్టు ముద్ర వేసేవారు. ఆడించేది టెస్టు క్రికెట్టా ఇంకోటా అన్నట్టు నిందించేవారు. వారి వంచనకు జోహార్లు' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.