MLA Pilot Rohith Reddy: నేడు ఈడీ అధికారుల ముందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు ఈడీ అధికారులు ఆయనకు ఈ నెల 16 నోటీసులు అందజేశారు. సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి రావాలని కోరారు. ఫైలెట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన వ్యాపారాల వివరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు, కుటుంబ సభ్యులకు సంబంధించి లావాదేవీలపై ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు కూడా అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా మారిన పైలెట్ రోహిత్ రెడ్డి నేడు.. ఈడీ ముందుకు హాజరు కావడం చర్చినీయాంశంగా మారింది. ఇటీవల పాదయాత్రలో బండి సంజయ్ కూడా బెంగుళూర డ్రగ్స్ కేసును తిరగ తోడతామని చెప్పిన నేపథ్యంలో పైలట్ ఈడీ అధికారుల ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే ఆమె ఈరోజు లేదా రేపు ఈడీ అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది.


ఈడీ నోటీసులపై ఎమ్మెల్యో రోహిత్ రెడ్డి..


ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలలో బీజేపీ బండారం బయటపెట్టినందుకే కక్షగట్టి ఈటీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులు ఆశ్చర్యంగా విచిత్రంగా ఉందన్నారు. నోటీసుల్లో తన బయోడేటా అడగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు నోటీసులు వచ్చాయని బండి సంజయ్‌ కు ముందే ఎలా తెలుసో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బండారం బయటపెట్టినందుకే కక్షపూరితంగా ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇలాంటి విచారణలకు భయపడేది లేదన్నారు. న్యాయవాదులతో చర్చించి నోటీసులకు తగిన సమాధానం ఇస్తానని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. 


ఈడీ నోటీసుపై బండి సంజయ్‌కి ముందే ఎలా తెలిసిందో సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానన్నారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తనకు నోటీసులు ఎప్పుడు వచ్చిందో బండి సంజయ్‌ చెప్పాలని ప్రశ్నించారు. అయ్యప్పమాలతో తాను యాదాద్రి వస్తానన్నారు. బండి సంజయ్ తడి బట్టలతో రావాలని సవాల్ చేశారు. బీఎల్‌ సంతోష్‌ తప్పు చేయకపోతే విచారణ నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. నీతిమంతులైతే బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ విచారణకు రావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.


డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి నోటీసులు


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో   టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంతో ఒక్కసారిగా హైలెట్‌ అయిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. డ్రగ్స్‌ కేసులో విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు అందుకున్నారు. నిన్నటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు  దొరక్కుండా ఉన్న పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఇప్పుడు ఈడీ చేతుల్లో చిక్కడంతో మరోసారి తెలంగాణలో రాజకీయం హాటెక్కింది. కొన్నినెలలుగా తెలంగాణలో  బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ వార్‌ నడుస్తోంది. ఈడీ, ఐటీ దాడులతో కేంద్రం అధికార పార్టీపై దాడులు చేస్తుంటే దానికి ప్రతిగా ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అలా ఇప్పుడు ఈడీ దర్యాప్తులో ఇరుక్కున్నారు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌ రెడ్డి కూడా ఉన్నారు. మీడియాకి దూరంగా, కేసీఆర్‌ నీడలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో రోహిత్‌ రెడ్డి ఒకరు. ప్రస్తుతం రోహిత్‌ రెడ్డిని ఎలాగైనా సరే విచారించాలని బీజేపీ ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడు తప్పించుకున్న తాండూరు ఎమ్మెల్యేపై ఇప్పుడు ఈడీ చేతిలో చిక్కుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.