Airport Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఎల్ అండ్ టీ (లార్సెన్ అండ్ టూబ్రో), ఎన్‌సీసీ లిమిటెడ్ (గతంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ)లు రేసులో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు మాత్రమే టెండర్ వేశాయి. మొత్తం 5,688 కోట్ల టెండర్ కోసం బిడ్‌లను సమర్పించాయి. రాయదుర్గ్ - ఎయిర్‌పోర్ట్ స్ట్రెచ్ కోసం ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఐపీసీ) కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఎఎమ్‌ఎల్) గురువారం ప్రారంభించింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ టెండర్‌లను ఆహ్వానించగా.. జూన్ 14న ప్రీ-బిడ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ స్టమ్, సైమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఈర్కాన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పండ్రోల్ రహీ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ సహా 13 జాతీయ, ప్రపంచ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కానీ గురువారం జరిగిన బిడ్డింగ్‌లో మాత్రం కేవలం రెండు సంస్థలే పాల్గొన్నాయి. 


బిడ్ల పరిశీలనకు పది రోజుల సమయం


పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌తో మెట్రో రైల్‌ను అభివృద్ధి చేసిన ఎల్‌ అండ్‌ టీ నష్టాలను అధిగమించడానికి ప్రభుత్వ సహాయం కోరింది. ఎయిర్‌ పోర్ట్ ప్రాజెక్టుకు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంజీబీఎస్, ఫలక్‌నుమా మధ్య మిగిలిన మెట్రో కనెక్టివిటీని చేపట్టాలని ఎల్ అండ్ టీని కోరింది. ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనుభవం, సాంకేతిక, ఆర్థిక బలాలు, ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలు, బ్యాంక్ గ్యారెంటీలలో ఒక్కొక్కటి 29 కోట్ల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్‌తోపాటు పత్రాలను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ రెండు సంస్థలకు సంబంధించిన వివరాలను ఎయిర్ పోర్టు మెట్రో రైలు సంస్థ నియమించుకున్న జనరల్ కన్సల్టెంట్, సీనియర్ సాంకేతిక అధికారులు క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు బిడ్ల మూల్యాంకనానికి పది రోజుల మసయం పడుతుందని హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అనంతరం తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. టెండర్లు ఈ నెలాఖరు నాటికి ఖరారు అయ్యే అవకాశం ఉంది.


ఈ కారణాల వల్ల ఇద్దరు తప్ప మిగితావారెవరూ బిడ్లు దాఖలు చేయలేదు!


మెట్రో టెండర్లను రెండు లక్షలు వెచ్చించి పలు ఇన్ ఫ్రా సంస్థలు కొనుగోలు చేశాయి. పదికి పైగా సంస్థలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కూడిన కన్సార్షియంలు ప్రీ బిడ్ సమావేశానికి హాజరు అయ్యాయి. టెండర్లు మాత్రం రెండు సంస్థలే దాఖలు చేశాయి. ఈ గ్లోబల్ టెండర్లకు పెద్దగా స్పందన లేకపోవడానికి మెట్రో అధికారులు కారణాలను వివరించారు. అత్యాధునిక సాంకేతికతలను టెండర్ డాక్యుమెంట్ లో చేర్చడం, అధిక సాంకేతిక ప్రమాణాలు, 36 నెలల్లో ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయాలనే కఠినమైన గడువు, పెరిగితే 500 కోట్ల రూపాయల వరకు జరిమానా చెల్లించాలనే నిబంధలే అని చెప్పారు. నైపుణ్యం కల్గిన మానవ వనరుల కొరత కారణంగా కూడా ఎక్కువ సంస్థలు రాలేదని మెట్రో వర్గాలు వెల్లడించాయి.