Vikarabad News: ప్రాణానికి ప్రాణంగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతడితో చాలా రోజుల పాటు మాట్లాడింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అమ్మాయి ఇతడితో మాట్లాడడం మానేసింది. అది తట్టుకోలేని యువకుడు ఆమెను మాట్లాడమంటూ బతిమాలాడు. అయినప్పటికీ ఆమె ఇతడి గోడును వినిపించుకోలేదు. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరించి మరీ రైపు పట్టాలపై పడుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ అతడిని పెంచుకున్న తల్లిందండ్రులు.. అతడి మృతదేహం చూసి తట్టుకోలేకపోతున్నారు. నుజ్జునుజ్జుగా మారిన మృతదేహాన్ని చూస్తూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల కుర్వ మహేష్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్ చదువుతున్నాడు. అయితే అదే కాలేజీకి చెందిన ఓ అమ్మాయిని మహేష్ కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా ఇతడి ప్రేమను అంగీకరించింది. కొన్నాళ్లు పాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఈ మధ్య వీరిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. అవి తట్టుకోలేని అమ్మాయి ఇతడితో మాట్లాడడం మానేసింది. ప్రియురాలు దూరం అవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మహేష్.. గుండెలవిసేలా రోదించాడు. మాట్లాడమంటూ అమ్మాయిని బతిమాలుకున్నాడు. అయినప్పటికీ ఆమె కనికరించలేదు. ఇక బతికి లాభం లేదనుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే రైల్వే స్టేషన్ కు దగ్గర్లోని పట్టాలపై నిల్చొని ఓ సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశాడు. 


వీడియోలో ఏముందంటే..?


"అమ్మా, నాన్.. సారీ.. నాకు బతకాలని లేదు. ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. చాలా దారుణంగా మోసం చేసింది. నేను ఆ మోసాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే చనిపోతున్నాను. అమ్మా.. నాన్నను బాగా చూసుకో నేను వెళ్లిపోతున్నా.!" అంటూ ఓ సెల్ఫీ వీడియోను తీసుకొని తల్లిదండ్రులకు పంపించాడు. అనంతరం అదే పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వీడియో చూసిన తల్లిదండ్రులు హుటాహుటిన రైలు పట్టాల వద్దకు వచ్చారు. కానీ అప్పటికే మహేష్ చనిపోయాడు. మృతదేహం అంతా నుజ్జునుజ్జు అయిపోయింది. అది చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కంటికి రెప్పలా కాపాడుకొని పెంచుకుంటే.. కడుపుకోత మిగిల్చావు కదరా అంటూ మహేష్ తల్లి ఏడుస్తున్న తీరు చూసి స్థానికులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


భర్త ఇంట్లో తినట్లేడని మహిళ ఆత్మహత్య 


బంజారాహిల్స్ ఏరియాలో ఇటీవలే జరిగిన సూసైడ్ మరీ విచిత్రంగా ఉంది. భర్త ఇంట్లో భోజనం చేయడం లేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ గౌరీ శంకర్‌ నగర్‌లో జరిగిందీ ఘటన. ఈ ప్రాంతంలో ఉండే సంగీత, సంజీవ్‌ మధ్య నాలుగు రోజుల క్రితం చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి భర్త కోపంతో ఉన్నాడు. ఆమె వండి పెట్టింది తినడం మానేశాడు. ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు. భర్త అలా నాలుగు రోజుల నుంచి తిండీ తిప్పలు లేకుండా తనతో మాట్లాడకుండా ఉండటంతో భార్య సంగీత భరించలేకపోయింది. ఎంత బతిమాలినా దారికిరావడం లేదని మానసికంగా తీవ్ర కలత చెందింది. అంతే ఎవరూ లేని సమయంలో ప్రాణం తీసుకుంది. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసుకోవడం ఏంటని బోరున విలపిస్తున్నారు.