శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. బాత్ రూమ్ లో జారిపడడం వల్ల డాక్టర్ బీఎస్ రావు చనిపపోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో తుది శ్వాస విడవడంతో బీఎస్ రావు భౌతిక కాయాన్ని స్వస్థలం అయిన విజయవాడకు తరలిస్తున్నారు. రేపు (జూలై 14) విజయవాడలో బీఎస్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. 


బొప్పన సత్యనారాయణ రావు తొలినాళ్లలో యూకే, ఇరాన్ లో డాక్టర్ గా పని చేశారు. అనంతరం భార్యతో కలిసి 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. అందులో భాగంగా తొలుత విజయవాడలోనే తొలి జూనియర్ కాలేజీని పెట్టారు. విజయవాడ నుంచి నెమ్మదిగా తమ కాలేజీలను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వీరి కాలేజీలు నెలకొల్పారు. మొత్తం 321 జూనియర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను వీరు నడుపుతున్నారు. 


చంద్రబాబు సంతాపం


బీఎస్ రావు చనిపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ఫౌండర్ ఎంతో విజన్ కలిగిన వారని, అద్భుతమైన విద్యను ఆయన ఏపీలోని లక్షలాది మంది విద్యార్థులకు అందించారని కొనియాడారు. ప్రతిష్టాత్మకమైన, ఎప్పటికీ గుర్తుండిపోయేలాంటి అసాధారణమైన వారసత్వాన్ని ఆయన వదిలి వెళ్లారని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.