DGP Meet CM : ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు, వాలంటీర్ల వ్యవస్థపై వివాదాలు, ఏపీ ప్రజల డేటా భద్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు కారణంగా సీఎంతో డీజీపీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అధికారిక సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి జగన్ , డీజీపీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ముఖ్యమంత్రికి డైరెక్టర్ జనరల్ నివేదికను అందించినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్ద పై తీవ్ర స్దాయిలో రాజకీయం నడుస్తోంది. ఇటీవల కాలంలో వాలంటీర్ల పని తీరు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పరోక్షంగా సహకరిస్తున్నారంటూ పవన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే దీని పై అధికార పార్టి కి చెందిన నేతలు తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. పవన్ కామెంట్స్ పై అటు వాలంటీర్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వరుసగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో నిరసనలతో హోరెత్తించారు. అయితే పవన్ మాత్రం తాను చేసిన కామెంట్స్ పై వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల పై ఉన్న ఆరోపణలను సైతం ప్రస్తావించి మరింత దూకుడు పెంచారు.
ఆ తరువాత తన వ్యాఖ్యల పై మరింత లోతుగా కూడ వివరణ ఇచ్చారు . అంతటితో ఆగకుండా పవన్ అదే జోష్ తో ముఖ్యమంత్రి జగన్ ను కేంద్రంగా చేసుకొని రాజకీయ విమర్శలు చేశారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు సేకరించిన డేటాను వేరే రాష్ట్రాలకు పంపి సొంత అవసరాలకు వినియోగిస్తున్నారంటూ అధికార పార్టి పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వాలంటీర్ల వద్ద ప్రారంభం అయిన వివాదం కాస్త, ఇప్పుడు డేటా ను కేంద్రంగా చేసుకొని రాజకీయ దుమారాన్ని రాజేసింది. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను కేంద్రంగా చేసుకొని ప్రారంభం అయిన రాజకీయ వివాదం ఇప్పుడు రాష్ట్ర డేటా కు సంబందించిన అంశంతో ముడిపెట్టి పవన్ కామెంట్స్ చేశారు.
పక్క రాష్ట్రానికి డేటా ఎమి వెళ్ళింది. అసలు అందులో వాస్తవాలు ఎంత అనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గామారింది. ఈ అంశాల నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను కలిసి చర్చించారని అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ తరువాత తాజా రాజకీయ పరిణామాలను గురించి కూడ డీజీపీ సీఎంకు నివేదిక ఇచ్చారని అంటున్నారు.
శ్రీకాళహస్తి ఘటన పై కూడ రాజకీయం రసవత్తరంగా మారింది. స్దానిక సీఐ అంజు యాదవ్ స్దానిక జనసేన నేత సాయి పై చేయి చేసుకున్న ఘటన పై కూడ పవన్ సీరియస్ గా స్పందించారు. శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటామని పవన్ హెచ్చరించారు. స్దానిక సీఐ దురుసుగా ప్రవర్తించిన తీరు పై డీజీపీ .. ముఖ్యమంత్రికి వివరణ ఇఛ్చినట్లుగా చెబుతున్నారు.