హైదరాబాద్ నుంచి లండన్‌కు ఇకపై నేరుగా ఎక్కడా ఆగకుండా వెళ్లిపోవచ్చు. ఈ మేరకు డైరెక్ట్ విమాన సర్వీసును ఎయిర్ ఇండియా సంస్థ ప్రారంభించింది. తాజా సర్వీసుతో ఇకపై లండన్‌కు కేవలం తొమ్మిది గంటల్లోనే గమ్యస్థానాన్ని ప్రయాణికులు చేరుకుంటారు. ఎయిర్‌ ఇండియా సంస్థ ఇవాళ్టి (సెప్టెంబరు 10) నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌ నుంచి నేరుగా లండన్‌కు వారంలో రెండు రోజులు సోమ, శుక్రవారాల్లో ఎయిర్ ఇండియా డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 


శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఎయిర్‌ ఇండియా నాన్‌స్టాప్‌ విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి కేవలం తొమ్మిది గంటల వ్యవధిలోనే చేరుకోగలుగుతుందని ఎయిర్‌ ఇండియా అధికారులు తెలిపారు. దీంతో చాలా కాలంగా నేరుగా విమాన రాకపోకల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల కల నెరవేరినట్లయింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు సమీప రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కూడా ఈ సేవలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడిందని ఎయిర్‌ ఇండియా సంస్థ అధికారులతోపాటు శంషాబాద్‌ జీఎంఆర్‌ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు.


ఇప్పటిదాకా ఇలా..


ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు యూకేలోని లండన్‌కు వెళ్లాలంటే కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కొచ్చి, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, అమృత్‌సర్, గోవా నగరాల నుంచే లండన్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు లండన్ వెళ్లాలంటే ఈ నగరాల్లో ఏదో నగరానికి వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లాల్సి వచ్చేది. తాజాగా, ఈ నగరాల జాబితాలో ఇకపై హైదరాబాద్ కూడా చేరింది. 


అయితే, హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు వారానికి కేవలం రెండు సర్వీసులు మాత్రమే ఉండనున్నాయి. అతి పెద్ద విమానం అయిన బోయింగ్ 787 రకానికి చెందిన డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 256 సీట్ల సామర్థ్యంతో వారానికి రెండు సార్లు హైదరాబాద్ టు లండన్ డైరెక్ట్ సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ విమానంలో 18 బిజినెస్‌ క్లాసులు, 238 ఎకానమీ క్లాసులు ఉంటాయని వివరించింది. భారత్-యూకే సెక్టార్ మధ్య విమానయాన సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఎయిర్ ఇండియా సంస్థ ఇటీవల అభిప్రాయపడింది.