దళిత బంధు పథకం వేగం పుంజుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే దళిత బంధుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న దళిత బంధుపై ప్రగతి భవన్‌లో ముక్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. దళిత బంధు అమలుకానున్న నాలుగు మండలాల్లో సన్నాహక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కలెక్టర్లు హాజరు కానున్నారు. అంతేకాక, దళిత బంధు అమలయ్యే నాలుగు మండలాలు మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు.


హుజూరాబాద్‌తోపాటు మరో నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో దళిత ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేశారు. ఆ నాలుగు మండలాల్లో అన్ని కుటుంబాలకు దళిత బంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.


దళిత బంధు అమలయ్యే ఆ నాలుగు మండ‌లాలు ఇవే..
ఖ‌మ్మం జిల్లా, మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం, చింత‌కాని మండ‌లం.. సూర్యాపేట జిల్లా, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం, తిరుమ‌ల‌గిరి మండ‌లం.. నాగర్‌ క‌ర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం, చార‌గొండ మండ‌లం.. కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజ‌క‌వ‌ర్గం, నిజాంసాగ‌ర్ మండ‌లంలో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.