ఆత్యహత్యల రేటు ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. పెళ్లి కాలేదని, పరీక్షల్లో తప్పామని, ఎంసెట్ ర్యాంక్ రాలేదని, వరకట్న వేధింపులని... ఇలా ఎన్నో కారణాలతో అనేక మంది ఆత్యహత్యకు పాల్పడుతున్నారు. వీరిలో కొంతమంది చనిపోవడానికి కొన్ని రోజులు లేదా నెలల ముందు మానసిక వేదనకు గురవుతారు. వారిలో చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతుంటారు. మీ స్నేహితుల్లోనే ఎవరైనా  నకిలీ చిరునవ్వుతో మీ ముందు నిల్చుని ఉండొచ్చు... కానీ వారి గుండెల్లో మెలిపెడుతున్న బాధ మీకు కనిపించదు.  ఆ బాధతోనే కొన్ని రోజుల పాటూ తమలో తామే మధన పడి వారు ఆత్మహత్యకు పాల్పడుతారు. అయితే మానసిక వైద్యనిపుణులు మాత్రం కొన్ని లక్షణాల ద్వారా డిప్రెషన్ బారిన పడిన వారిని, ఆత్మహత్యా చేసుకోవాలనే ఆలోచన కలవారిని ముందే కనిపెట్టి తగిన కౌన్సిలింగ్, చికిత్స ద్వారా వారిని ఆరోగ్య వంతులుగా మార్చొచ్చని చెబుతున్నారు. 


ప్రతిఏడాది సెప్టెంబర్ 10న ‘వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే’ ను ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఆత్మహత్యలను నిరోధించడానికి అవసరమయ్యే అవగాహనను ప్రజల్లో కల్పించడానికే ఈ ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశారు. మానసిక వైద్యులు చెబుతున్నదాని ప్రకారం లక్షణాలు ఇలా ఉంటాయి. 


ఆత్మహత్యకు ప్రధాన కారణం డిప్రెషన్. ఇది కలగడానికి కారణాలు మనిషి మనషికి వేరువేరుగా ఉండొచ్చు. కానీ లక్షణాలు మాత్రం అందరిలో ఒకేలా ఉంటాయి. ఒక మనిషిలో డిప్రెషన్ కలిగేందుకు జన్యువులు కూడా ముఖ్యపాత్ర వహిస్తాయి. విటమిన్ బి12, విటమిన్ డి విటమిన్ల లోపాలు కూడా డిప్రెషన్ తో అనుసంధానమై ఉంటాయి. డయాబెటిస్, హైపోథెైరాయిడిజం, హెచ్ ఐవీ, పార్కిన్సన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా డిప్రెషన్ కలిగేందుకు కారణం కావచ్చు. 


డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు కలుగుతాయి. వారి లక్షణాలు ముఖ్యంగా ఇలా ఉండొచ్చు...
1. నిద్రలేమితో బాధపడవచ్చు. అర్ధరాత్రి కూడా నిద్రపోకుండా ఇటూ అటూ తిరుగుతుండడం చేయచ్చు.
2. ఆహారం తినేప్పుడు చాలా తక్కువగా తినడం, తినడానికి ఆసక్తి చూపించకపోవడం లేదా అతిగా తినడం
3. తమకు తాము హానిచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. 
4. ఎలాంటి పని చేయకపోయినా అలసిపోయినట్టు ఫీలవ్వడం
5. ప్రతి చిన్న విషయానికి విసిగిపోవడం
6. తనకు సాయం చేసేందుకు ఎవరూ లేరని పదేపదే అంటుంటారు. 
7. నలుగురిలో ఉన్న కూడా కలవరు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. 
8. నిత్యం ఏదో లోకంలో ఉన్నట్టు ప్రవర్తిస్తారు. 


మనమెలా సాయం చేయొచ్చు...
మన చుట్టూ ఉన్న బంధువుల్లో లేదా స్నేహితుల్లో మార్పును మనం ఇట్టే కనిపెట్టచ్చు. అలాంటి వారిలో పై లక్షణాలు కూడా కనిపిస్తున్నాయేమో గమనించాలి. అయితే వారితో నేరుగా ‘డిప్రెషన్ గా ఉందా’ అంటూ అడిగేయకూడదు. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, లక్షణాలు అడిగి తెలుసుకోవాలి. మీరు ఎక్కువ మాట్లాడకుండా, ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. గుండెలోని బాధ, ఫీలింగ్స్ ను చెప్పుకుంటే వారికి నిజంగా తేలికగా అనిపిస్తుంది. మీకు పైన చెప్పిన లక్షణాలు బలంగా కనిపిస్తే... అతడిని ఒప్పించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు. అవసరమైతే మందులు కూడా రాస్తారు. 


Also read: ఈ టీ తాగితే .. అందం అమాంతం పెరిగిపోతుందా!


Also read: చపాతి, పూరీ, పుల్కా... వీటిల్లో ఏది తింటే మంచిది?