ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న ఓ సభకు ఆమె హాజరు కానున్నారు. ప్రియాంక గాంధీ పర్యటన మే నెల 8న హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొంటారని తెలుస్తోంది. నిజానికి ఈనెల 5 లేదా 6న సరూర్ నగర్ స్టేడియంలో జరగాల్సి ఉంది. ఆ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇంతకుముందే ప్రకటించారు. కానీ, ఇదే సభ 8వ తేదీకి వాయిదా పడినట్లు తెలిసింది.
ప్రస్తుతం ప్రియాంక గాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అక్కడి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ నెల 8తో ముగియనుంది. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్తూ ఆమె హైదరాబాద్‌కు వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కర్ణాటకలో బిజీగా ప్రియాంక గాంధీ
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండగా.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రచార వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. మైసూరు-చామరాజనగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన ప్రియాంక గాంధీ ఇప్పుడు మాండ్యా, కోలార్, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ ప్రాంతాల్లో నేడు ప్రచారం నిర్వహించి, పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు మండ్యలో నిర్వహించే సదస్సులో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు చింతామణి, 5.30 గంటలకు హోస్కోటే, 7.15 గంటలకు నగరంలోని సి.విరమణలో పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటారు.
అంగన్ వాడీలకు హామీలు
ఇటీవలి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కర్ణాటకలో అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని ₹ 11,500 నుండి ₹ 15,000 కు, మినీ అంగన్‌వాడీలకు ₹ 7,500 నుండి ₹ 10,000 కు పెంచుతామని ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. బెల్గాంలోని ఖానాపూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ పార్టీ అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ వర్కర్స్ (ఆశా) కార్యకర్తల గౌరవ వేతనాన్ని నెలకు ₹ 8,000, మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పనిచేసే మహిళలకు ₹ 5,000 కు పెంచుతామని అన్నారు.
పదవీ విరమణ తర్వాత 2 లక్షలు
అంగన్‌వాడీ కార్యకర్తలకు పదవీ విరమణ లేదా అకాల మరణానంతరం వారి నామినీలకు ₹ 3 లక్షలు, మినీ అంగన్‌వాడీలలో పనిచేస్తున్న వారికి ₹ 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికార భారతీయ జనతా పార్టీ నేతలు ఎలా దోచుకున్నారో, ప్రజలు ఎలా మోసపోయారో రాష్ట్ర ప్రజలు అడుగడుగునా చూస్తున్నారని అన్నారు.
అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. అన్ని తాలూకాలు, జిల్లాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రచారంతో దూసుకుపోతోంది. కర్ణాటకలో అధికారాన్ని అధిరోహించే లక్ష్యంతో బలంగా ఉంది. మరోవైపు రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న లింగాయత్ ఓటు బ్యాంకుపై కన్నేసిన ఆ పార్టీ ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకునే పనిలో పడింది. దీనికి సంబంధించి ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు భారీ ప్రచారంలో తలమునకలై ఉన్నారు.