Agneepath Protests In Secunderabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో కీలక ఫుటేజీ బయటికి వచ్చింది. విధ్వంసం, అల్లర్లు మొదలు కావడానికి ముందు కొందరు యువకులు రైలుకు నిప్పు అంటిస్తున్న వీడియోలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అంతేకాక, ఇనుప రాడ్లతో ఏసీ రైలు బోగీలను పగల గొట్టారు. ప్లాట్ ఫాంపైన ఉన్న ఫుడ్ స్టాళ్లను నాశనం చేశారు. కొందరు యువకులే ఈ అన్ని పనులకు పాల్పడ్డట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల ద్వారా స్పష్టం అవుతోంది.


ప్యాసింజర్ బోగీలోకి వెళ్లిన యువకుడు కొన్ని పేపర్ల కట్టను అగ్గిపెట్టెతో అంటించి, తొలుత సీట్లకు నిప్పు పెట్టాడు. ఇతణ్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్వీరాజ్‌ గా గుర్తించారు. కొంత మంది యువకులు ఈ నేరాలకు పాల్పడుతుండగా, మరికొందరు వాటిని ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత నిందితులే ఆ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రైలుకు నిప్పు పెట్టిన యువకుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోనికి తీసుకోని విచారణ చేస్తున్నారు. 


ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ యువకుడు ఈ అల్లర్ల కేసులో ఏ - 12 గా ఉన్నాడు. అతనితో పాటు మరో 9 మంది నిందితులను కూడా గుర్తించారు. ఇప్పటికే ఈ రైలుకి నిప్పు పెట్టిన యువకుడికి వైద్య పరిక్షలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో అతడిని రిమాండ్‌కు తరలించారు.


‘సాయి డిఫెన్స్ అకాడమీ’ నిర్వహకుడు సుబ్బారావు సహా 15 మందిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. సుబ్బారావు పాత్రపై కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లుగా సమాచారం. అలాగే పరారీలో ఉన్న 25 మంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 10 మంది వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు ఆందోళన కారులతో పాటు ఇప్పటి వరకూ పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు.


ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నం
ఈ సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్న వరంగల్‌ కు చెందిన ఓ యువకుడు గోవింద్‌ అజయ్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అజయ్‌.. తనపై కేసులు పెడతారేమోనని భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అజయ్‌ తల్లిదండ్రులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అజయ్‌ వాట్సాప్‌ మెసేజ్‌ రావడం వల్లే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. తాను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ అల్లర్లు జరిగాయని చెప్పాడు. తాను ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా తాను దరఖాస్తు చేశానని చెప్పాడు. ఈ ఆందోళనల వల్ల తనకు ఉద్యోగం రాదనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పాడు.