Hyderabad Rape Case Verdict: కూతురుపై ఓ సవతి తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో కోర్టు దోషికి కీలక శిక్ష విధించింది. ఏకంగా 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ పదో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ లోని బర్కత్ పురలో 2017లో ఈ అత్యాచార నేరం జరిగింది. అదే సమయంలో నిందితుడితో పాటు అతని తమ్ముడు (బాధితురాలికి వరుసకు బాబాయి) కూడా బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో కోర్టు రూ.5 వేల ఫైన్ తో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష, అతని తమ్ముడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.
కాచిగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆమె తన భర్త చనిపోవడంతో మహమ్మద్ జహంగీర్ అనే 35 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే మొదటి భర్తకు, ఆమెకు జన్మించిన 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ మహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి బర్కత్ పురలోనే ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న అనంతరం భార్య చుట్టుపక్కల కొన్ని ఇళ్లలో పాచి పని చేయడానికి ఉదయం వేళ వెళ్లేది.
ఆ సమయంలో 13 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగానే ఉండేది. 2017లో ఓ రోజు మహమ్మద్ జహంగీర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంబర్‌పేటలో ఉండే అతని తమ్ముడు మహమ్మద్ భాషా అనే 32 ఏళ్ల వ్యక్తిని కూడా రప్పించి అతనితో కూడా అత్యాచారం చేయించాడు. అయినా ఆ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పలేదు.
2017లో బాలిక చదువుతున్న స్కూలులో టీచర్ ఆమె పడుతున్న మనోవేదనను గమనించింది. ఆమె మొత్తం వివరాలు ఆరా తీయగా బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి టీచర్ కు చెప్పింది. దీంతో ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పుడే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత మహమ్మద్ జహంగీర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతేకాక, ఆమెకు రూ.5 వేల జరిమానా, అతని సోదరుడు మహమ్మద్ భాషాకు మూడేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు.