టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అనే వ్యాపార వేత్తపై హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలో గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొనేందుకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వచ్చిన సందర్భంగా శుక్రవారం మొజంజాహీ మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ నేత నందు బిలాల్ మైక్ లాగేశారు. ఈ ఘటనలోనే నందు బిలాల్ పై సుమోటో కింద అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావుపై కూడా కేసు నమోదు అయింది.
నందు కిషోర్ బిలాల్, భగవంతరావు పై ఐపీసీ సెక్షన్ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అసోం సీఎం మొజంజహీ మార్కెట్ దగ్గర భాగ్యనగర్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన స్టేజ్ ఎక్కి మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దీంతో, అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత నందు బిలాల్ సీఎంను అడ్డుకునేందుకు ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కున్నారు.
స్పందించిన అసోం సీఎం
మొజంజాహీ మార్కెట్ దగ్గర జరిగిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తనపై పక్కా ప్రణాళికతోనే టీఆర్‌ఎస్ నాయకుడు దాడికి యత్నించాడని ఆరోపించారు. వేదికపైకి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకుడు తనకు చాలా దగ్గరగా ఉన్నాడని, ప్రసంగాన్ని అడ్డుకోవాలని యత్నించాడని అన్నారు. ఆ సమయంలో ఏదైనా పదునైన ఆయుధంతో తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు.
తెలంగాణ డీజీపీకి అసోం డీజీపీ ఫోన్
ఈ ఘటనపై వెంటనే అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. అసోం సీఎంకు కల్పించిన భద్రతపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. భద్రత లోపానికి కారకులైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అసోం డీజీపీ కోరారు. దీనిపై తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతి తెలంగాణ డీజీపీతో ఫోన్‌లో మాట్లాడి, గణేష్ నిమజ్జనం సందర్బంగా సీఎం హిమంతకు జరిగిన ఉదంతంపై వాకబు చేశారని ఆ ప్రకటనలో ఉంది. అంతేగాని, అసోం సీఎం అభద్రతకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయలేదని స్పష్టత ఇచ్చింది.