Travelling Problems: దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లాలని, పండుగను అందరితో కలిసి జరుపుకోవాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు చాలా మంది. దీని కోసం ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులు సెలవులు తీసుకొని మరీ ఊళ్లకు బయలు దేరుతుంటారు. ఇందు కోసం ముందు నుంచి బస్సులు, రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం టికెట్లు బుక్ చేసుకుందామని వైబ్ సైట్ ఓపెన్ చేసిన వారు షాక్ కు గురి అవుతున్నారు. ఓ వైపు బస్సు టికెట్లు ధరలు ప్రయాణికుల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుండగా... రైళ్లలో వెయిటింగ్ లిస్టు మరింత ఆందోళన చెందేలా చేస్తున్నాయి. పలు మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో బెర్తులన్నీ నిండి పోయాయి. వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. మరి కొన్ని రైళ్లలో ఈ పరిమితి దాటి రిగ్రెట్ చూపిస్తోంది. వరుసగా ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచేయడంతో.. బస్సు ప్రయాణాలు అంటేనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. 


ఆ మూడు రోజులే ఎక్కువ.. 
పండుగకు సొంత ఊరు వెళ్లి బందుమిత్రులతో కలిసి సరదాగా గడపాలని అనుకున్న వారికి ఆదిలోనే నిరాశ ఎదురు అవుతోంది. అక్టోబరు 3న దుర్గాష్టమి, 4న నవమి, 5న విజయ దశమి కావడంతో.. ఈ నెల 30, అక్టోబరు 1, 2 తేదీల్లో ఎక్కువ మంది పల్లెలకు వెళ్తుంటారు. ఈ నెల 29వ తేదీ నుండి 5వ తేదీ వరకు రైళ్లలోని బెర్తులన్నీ నిండి పోయాయి. హైదరాబాద్ నుండి అటు ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు సహా గ్రామాలకు, ఇటు తెలంగాణ లోని జిల్లా కేంద్రాలు సహా.. పల్లెటూర్లకు వెళ్లేందుకు చాలా మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగిస్తారు. అయితే.. రైళ్లలో ఖాళీ లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. విజయవాడ, శ్రీకాకుళం వెళ్లే హౌరా, భువనేశ్వర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. ఫలక్ నుమా, హౌరా యశ్వంత్ పూర్, గువాహటి,   మెయిల్, కోణార్క్, విశాఖ, ఈస్ట్ కోస్ట్, తిరుపతి పూరీ ఎక్స్ ప్రెస్ ల్లో స్లీపర్ బెర్తులన్నీ నిండిపోయాయి. వెయిటింగ్ లిస్టు 100 నుండి 200 వరకు ఉంది. గువాహటి ఎక్స్ ప్రెస్ లోనూ వెయిటింగ్ లిస్టు భారీగానే ఉంది. ఫలక్ నుమా లో ఈ నెల 30 వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు పరిమితి దాటి రిగ్రెట్ చూపిస్తోంది. 


ఆర్టీసీలోనూ విపరీతంగా పెరిగిపోయిన ఛార్జీలు.. 
రైళ్లలో సీట్లు దొరకడం లేదు, బస్సుల్లో వెళ్దామనుకున్నా అందులోనూ నిరాశ తప్పడం లేదు. బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచడంతో బస్సు ఛార్జీలు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. అటు తెలంగాణ ఆర్టీసీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ రెండూ ఇటీవల ఛార్జీలను విపరీతంగా పెంచాయి. ఛార్జీలు, సర్ ఛార్జీలు, సెస్సుల పేరుతో ధరల బాదుడు గట్టిగానే ఉంది. పండగ పూట స్పెషల్ బస్సుల పేరుతో మరింత ఛార్జీలు పెంచే అవకాశం ఉండటంతో.. ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ దసరా పర్వ దినానికి సొంతూరికి ఎలా వెళ్లడం అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.