Minister Botsa: రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పసిర్థితిలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం వాస్తవమే అన్నారు. ప్రత్యామ్నాయ పథకానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఇది రెండు నెలల్లో కొలిక్కి వస్తుందని వివరించారు. శనివారం విజయనగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నాగులో వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ విధానంలో మార్పులు తీసుకువచ్చినప్పటికీ... ఎవరికీ ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 


ఆర్టీసీ సిబ్బందికి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు.. 
వచ్చే మూడు నెలల్లో విద్యా శాఖలో ప్రమోషన్లు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే ఎంఈఓల నియామకం చేపట్టామన్నారు. పీఆర్సీతో కలిసి జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ఆర్టీసీ సిబ్బందికి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయన్నారు. అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల మంది ఉద్యోగుల విషయంలో సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయంపై అనేక సార్లు చర్చలు జరిపామన్నారు. కేంద్రం ఆదేశించిన విధంగా వారికి ఓపీఎస్ అమలు చేయాలా లేకా సీపీఎస్ అమలు చేయాలా అన్నది ఆర్థిక శాఖ ద్వారా కూడా చర్చ జరిగిందన్నారు. ఈ విషయంపై ఈ నెల చివర్లో స్పష్టత వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. అయితే ఈ సమావేశంలో మొదటి ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్, సూర్య నారాయణ, కార్యదర్శి జి. అస్కారరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరినీ దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 


జీపీఎస్ అమలుకు ఉద్యోగులను ఒప్పించాలని.. 
ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను ఎలాగైనా ఒప్పించి జీపీఎస్‌ను అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బిల్లు కూడా రెడీ చేశారని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తీసుకోవచ్చని కూడా అధికారవర్గాలు అనుకున్నాయి. కానీ ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ మరో రెండు నెలల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల కల్లా సీపీఎస్ సమస్యకు ఏదో ఓ పరిష్కారం చూపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ నేరుగా ఇచ్చిన హామీ సీపీఎస్ రద్దు. ఉద్యోగ నేతలతో కలిసి ఉద్యమాలు కూడా చేశారు. అందుకే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. 


మాకు ఇగో లేదు... 
ఉపాధ్యాయ సంఘాల నేతలతో రెండు అంశాలపై ముఖ్యంగా చర్చించామని మంత్రి బొత్స తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాని చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ యాప్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలనేదే సీఎం జగన్ ఉద్దేశమన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎప్పటి నుంచో వస్తున్న సిస్టమేనని కొత్తగా పెట్టింది ఏమీ లేదని మంత్రి బొత్స తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తున్నామన్నారు.  తమకు ఇగో లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి చేయాలనేదే తమ తపన అని బొత్స అన్నారు.