Chidambaram Temple: సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. పృథ్విలింగం(కంచి), ఆకాశలింగం(చిదంబరం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్ని (అరుణాచలం), వాయులింగం(శ్రీకాళహస్తి)లను పంచభూతలింగాలు అంటారు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ పంచభూతలింగాల్లో ఒకటైన చిదంబంరం నుంచే వచ్చింది ఈ చిదంబర రహస్యం అనేమాట..


చిదంబర రహస్యం అని ఎందుకంటారు
పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ....మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది.


Also Read: అక్టోబరు, నవంబరులో రెండు గ్రహణాలు - ఈ రాశులవారు చూడకూడదు!


ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగానే కనిపించినట్టే మూలవిరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలెట్టారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా...  దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ : శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు..అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు. 


చిదంబరం ఆలయంలో అద్భుతం ఇదే..



  • మానిషికి న‌వ రంధ్రాలు ఉన్నట్టే చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి

  • మానిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు..ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు.

  • ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది.

  • చిదంబ‌రం దేవాలయంలో "పొన్నాంబళం" కొంచెం ఎడమ వైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడకి వెళ్ళడానికి "పంచాక్షర పడి" ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది.

  • "కనక సభ"లో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు.

  • పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు

  • 9 కలశాలు 9 రకాల శక్తికి, అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీక

  • ప‌క్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి సూచిక


Also Read: బ్రహ్మాస్త్రం అంటే ఏంటి, ఇదెంత పవర్ ఫుల్, ఎవరెవరి దగ్గర ఉండేది


ఇక్కడ లింగ దర్శనం ఉండదు..అంతా శూన్యమే. నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు). జీవిత కాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది అని ప్రతి భక్తుడు భావిస్తాడు.