కృష్ణంరాజు చనిపోయిన వేళ ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్‌ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఆ మేరకు సీఎం కింది స్థాయి అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు. దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్ లో జరుగుతాయి. ఇంటినుండి ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివదేహం బయలుదేరుతుంది.


‘‘ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు’’ అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.


ప్రధాని మోదీ, అమిత్ షా సంతాపం


కృష్ణంరాజు అటల్ బిహారీ వాజ్ పేయీ హాయాంలో కేంద్ర మంత్రిగా పని చేయడం, బీజేపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలవడంతో ఆ పార్టీతో ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో బీజేపీ అగ్ర నేతలు కూడా రెబల్ స్టార్ మరణం పట్ల స్పందించారు. కృష్ణంరాజు అటల్ బిహారీ వాజ్ పేయీ హాయాంలో కేంద్ర మంత్రిగా పని చేయడం, బీజేపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలవడంతో ఆ పార్టీతో ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో బీజేపీ అగ్ర నేతలు కూడా రెబల్ స్టార్ మరణం పట్ల స్పందించారు. ప్రధాని మోదీ కృష్ణంరాజు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన నటన, ప్రతిభను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని అన్నారు. రాజకీయ నాయకుడిగానూ ఆయన సేవలు ఆదర్శంగా ఉంటాయని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారు. కృష్ణంరాజు ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. అద్భుతమైన నటుడు, సమాజ సేవతో సైతం ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అమిత్ షా అన్నారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటునువ మిగిల్చిందన్నారు. 


బీజేపీకి, సినీ పరిశ్రమకు తీరని లోటు: కిషన్ రెడ్డి
ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇకలేరన్న విషయం తెలిసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఏపీ తరఫున బీజేపీకి ఆయనతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రముఖ నటుడు మాత్రమే కాదు, గొప్ప మనసున్న వ్యక్తి ఆయన. కృష్ణంరాజు మరణం బీజేపీకి, తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు కానుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు కిషన్ రెడ్డి. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు.


‘కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మరణం చాలా విచారకరం. సినిమాల్లో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు’ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.