తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్ 4 పరీక్ష మొదటి సెషన్ ముగిసింది. 2.30కు రెండో సెషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. 8,180 గ్రూప్-4 ఉద్యోగాలతో పడిన నోటిఫికేషన్‌కు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేశారు. దీంతో చాలా మంది అభ్యర్థు ఆఖరి నిమిషంలో వచ్చి లోపలికి అనుమంతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మరికొందరు సెంటర్ వద్ద బోరున విలపించారు. ఓ అభ్యర్థి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ సెంటర్‌కు గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ స్కూల్ ఉండే పాత అడ్రెస్ చూపించింది. అక్కడకు వెళ్లి విషయం తెలుసుకొని కొత్త స్కూల్ అడ్రెస్‌కు వెళ్లేసరికి టైం అయిపోయిందని అధికారులు చెప్పి అనుమతి ఇవ్వలేదు.
అన్ని పరీక్ష కేంద్రాల్లో పేపర్-1కు ఉదయం 9.45 గంటలకే గేట్లు మూసేశారు.
పేపర్-2కు , మధ్యాహ్నం 2.15 గంటలకే గేట్లకు తాళాలు వేసేశారు. హైదరాబాద్‌లో ఓ పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత అభ్యర్థి వద్ద సెల్‌ఫోన్ ఉన్నట్టు ఇన్విజిలేటర్ గుర్తించారు. అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.
పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగుతుంది. గ్రూప్-4 పరీక్షపై 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష ఏర్పాట్లు, నిబంధనలు, పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులు తదితర అంశాలపై చర్చించారు. 2,878 లైజన్ ఆఫీసర్లతో కలెక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించలేదు. వాచ్, హ్యాండ్ బ్యాగ్, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లనీయలేదు. పరీక్ష కేంద్రాల్లోని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంచారు.
మొదటి సెషన్‌లో జరిగిన పరీక్షలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. బలగం సినిమాపై ఓ ప్రశ్న వచ్చినట్టు సమాచారం. జతపరచమని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.
ప్రశ్న ఇదే:- బలగం చిత్రానికి సంబంధించి సరైన జవాబుతో జతపరచండి. అని ప్రశ్న ఇచ్చి... A. దర్శకుడు: వేణు యెల్హండి B. నిర్మాత: దిల్ రాజు/ హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి C.సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో D. కొమరయ్య పాత్రను పోషించినవారు: అరుసం మధుసూధన్ అని ఇచ్చి కంద ఆప్షన్లు ఇచ్చారు. దీనికి సరైన జవాబు ఏ అండ్ బీ
గతంలో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా బలగంపై ప్రశ్నలు అడిగారు.
అదే టైంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే పథకాలు, ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. భారత్ ఆర్థిక పరిస్థితిని ఉటంకిస్తూ కూడా ప్రశ్నలు అడిగారు.