Hyderabad Crime News: కెమికల్ ఇంజినీరింగ్ చేశాడు. 22 ఏళ్ల వయసులోనే 58 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం కూడా సంపాదించాడు. యువకుడి తొలి విజయానికి తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. తమ కుమారుడు చిన్న వయసులోనే సెటిల్ అవుతున్నాడని తెగ మురిసిపోయారు. కానీ అంతలోనే అనుకోని ప్రమాదం వచ్చి పడింది. ఉద్యోగంలో చేరేలోపే గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు.
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ ఎండీ కే చంద్ర శేఖర్ రెడ్డి పెద్ద కుమారుడు అభిజీత్ రెడ్డి. అయితే అభిజీత్ వరంగల్ నిట్ లో కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ చేశాడు. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీ సౌదీ అరామ్ కో లో ఉన్నత ఉద్యోగం సాధించాడు. ఏడాదికి 70 వేల అమెరికన్ డాలప్లు అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 58 లక్షల రూపాయలు వేతనం. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అయితే ఆదివారం రాత్రి వాకింగ్ కు వెళ్లొచ్చాడు. అదేరోజు రాత్రి భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ టీవీలో చూశాడు. అర్ధరాత్రి దాటాకా దాదాపు 2 గంటలకు అభిజీత్ రెడ్డికి ఛాతీలో నొప్పితో మెలకువ వచ్చింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కుప్పకూలిపోయాడు. అన్న అలికిడికి లేచిన తమ్ముడు.. ఆందోళనతో తల్లిదండ్రులను లేపాడు. అన్నకు ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్పాడు.
గుండెపై నొక్కుతూ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది..!
అభిజీత్‌కు ఛాతీలో నొప్పి వచ్చిందని గుండెపోటు అని కుటుంబసభ్యులు భావించారు. పరిస్థితి అర్థం చేసుకున్న కుటుంబసభ్యులు ఆందోళన చెందకుండా వెంటనే అభిజీత్ గుండెపై రెండు చేతులతో గడ్డిగా నొక్కడం మొదలుపెట్టారు. కాసేపు సీపీఆర్ చేసిన తర్వాత వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ అభిజీత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎదిగిన కుమారుడు ప్రయోజకుడై తమను చూసుకుంటాడనుకుంటే కేవలం 22 ఏళ్ల వయసులోనే చనిపోవడంతో చంద్ర శేఖర్ రెడ్డి, ఆయన సతీమణి కన్నీరుమున్నీరయ్యారు. వీరి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల. అభిజీత్ అకాల మరణంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ వైద్య మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.
వ్యాయామం చాలా అవసరం..
ఇటీవల గుండెపోటుతో చాలా మందే చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా నిల్చున్న చోట, డ్యాన్స్ చేస్తున్న చోట, వ్యాయామం చేస్తుండగానే కుప్పుకూలిపోయి.. క్షణాల్లోనే ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వివిధ దేశాల్లో 45-45 ఏళ్ల వారిలో ఎక్కువగా గుండెపోటు వస్తుండగా... మన దేశంలో మాత్రం 25 నుంచి 30 ఏళ్ల వారిలోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే శారీరక వ్యాయామం చేయకుండా ఎక్కువ సేపు పోన్లు, ల్యాప్ టాప్ లతో గడపడం వల్ల బయట జంక్ ఫుడ్ తినడం వల్ల గుండెపోటు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమంగా మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, నిద్రలేమి, గురక సమస్యతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ కొంచెం సమయం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే బయట ఫుడ్ ను వదిలేసి ఇంట్లో చేసే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి.