YS Sharmila Letter : రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు ఉన్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. ఈ మేరకు ఆమె గవర్నర్ తమిళి సై కు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను బెదిరిస్తూ, వారిపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్ ఫాసిస్ట్ పరిపాలన సాగిస్తుందని, రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని విమర్శించారు. ఈ నెలలో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనం అన్నారు. తెలంగాణ దుష్టపాలనలో కొట్టుమిట్టాడుతుందని ఆక్షేపించారు. తాను కూడా బీఆర్ఎస్ నేతల దాడుల్లో బాధితురాలినన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరారు.
బాధితుల పైనే కేసులు, అరెస్టులు
"కొద్దిరోజుల క్రితం నా ప్రజా ప్రస్థానం పాదయాత్రపై దాడి జరిగిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. పాదయాత్రను అడ్డుకున్న వారిని అరెస్టు చేయకుండా పోలీసులు నన్ను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. సీఎం కేసీఆర్ పోలీసులు ఇష్టారీతిన వాడుకుంటూ ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు నాకు మంజూరు చేసిన అనుమతిని పోలీసులు, ప్రభుత్వం అగౌరవపరిచింది. ఇది న్యాయవ్యవస్థ తీర్పును ధిక్కారించడమే. నేను అక్టోబర్ 2021 నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్రలో చేస్తున్నారు. దాదాపు 3900 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నాను. అధికార పార్టీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. పాదయాత్ర సమయంలో పదే పదే నన్ను అసభ్యకరమైన అవమానకరమైన పదజాలంతో మాటలతో నాపై దాడి చేస్తున్నారు. ప్రజల కోసం పోరాడుతున్న మహిళను లక్ష్యంగా చేసుకోవడం చాలా సిగ్గుచేటు. అన్ని అవాంతరాలు దాటి పాదయాత్ర చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ గూండాలు మాపై దాడి చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి బదులు, పోలీసులు నన్నే అరెస్టు చేసి, నా పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు" - వైఎస్ షర్మిల
ఉద్దేశపూర్వకంగా దాడులు
హైకోర్టు అనుమతితో పాదయాత్రను పునఃప్రారంభించామని వైఎస్ షర్మిల తెలిపారు. గత నెలలో తన పాదయాత్ర మొదలైందని, అయితే ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ నేతలు మాపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఉద్దేశపూర్వకంగా పోలీసుల సమక్షంలో జరిగిందన్నారు. శాంతిభద్రతల సమస్యగా కారణం చూపిస్తూ పాదయాత్రకు మరోసారి అనుమతి రద్దు, నన్ను అరెస్ట్ చేశారన్నారు. తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చారన్నారు. మూడు రోజుల క్రితం ఓ యువ నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు దారుణంగా దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. కేసీఆర్ సాగిస్తున్న ఈ భయానక పాలనలో తెలంగాణ ప్రజల పక్షాన మా ఆందోళనలను బలంగా వినిపిస్తున్నామన్నారు. తెలంగాణ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాడులు పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని అరెస్టులు చేయరని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపుచేయడానికి చివరి అవకాశం మీరేనని గవర్నర్ ను వేడుకున్నారు. ఈ అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. దీంతో పాటు తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను అభ్యర్థించారు.