Mlc Kavitha : ప్రజల పైసలతో కేంద్రం ఆటలాడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే కేంద్రం మౌనంగా ఎందుకుందని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అంటూ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల కవిత తీవ్రంగా స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ధ్వజమెత్తారు. ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.






పెద్ద కుంభకోణం 


ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు 12 లక్షల కోట్లు నష్టపోయినా సీబీఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా అని నిలదీశారు. హిండెన్ బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. అప్పుడే కేంద్రం జేపీసీ ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత నష్టపోయేవారు కాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి మరింత నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జేపీసీని నియమించాలని కవిత డిమాండ్ చేశారు. 


ఆల్ టైమ్ కనిష్టానికి ఎల్ఐసీ


శుక్రవారం (25 ఫిబ్రవరి 2023) ట్రేడింగ్‌లో, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (LIC) షేర్లు 1% పైగా పడిపోయాయి, రూ. 585 వద్ద ముగిశాయి. ఈ స్టాక్‌, తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 582 కంటే ఒక్క అంగుళం పైన మాత్రమే ప్రస్తుతం ఉంది.  అదానీ గ్రూప్ షేర్లలో పతనం కారణంగా, ఆ గ్రూప్‌ షేర్లలో ఎల్‌ఐసీ లాభాలు అత్యంత భారీ స్థాయిలో ఆవిరవడం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. అదానీ తుపాను మొదలైన నాటి నుంచి, గత నెల రోజుల్లో, LIC షేర్‌ ధర దాదాపు 15% తగ్గింది. BSE సమాచారం ప్రకారం... అదానీ గ్రూప్‌లోని అదానీ పోర్ట్స్ & సెజ్‌లో LIC అతి పెద్ద పెట్టుబడి ఉంది, ఆ కంపెనీలో 9.1% వాటాను కలిగి ఉంది. ఇతర ఆరు అదానీ గ్రూప్ కంపెనీల్లో 1.25% నుంచి 6.5% మధ్య వాటాలు ఉన్నాయి.  శుక్రవారం సెషన్‌లో, అదానీ గ్రూప్‌లోని 10 కౌంటర్లలో ఏడు నష్టాల్లో ముగిశాయి. ఈ ఏడు కౌంటర్లలో, నాలుగు స్టాక్స్‌ - అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ మరియు అదానీ పవర్ - వాటి 5% లోయర్ సర్క్యూట్‌లోకి పడిపోయాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 5% నష్టంతో ముగిసింది. అదానీ విల్మార్ 3.3% దిగువన ముగియ, NDTV 4.1% క్షీణించింది.  మిగిలిన స్టాక్స్‌లో... అంబుజా సిమెంట్స్ 2.4% లాభంతో ముగియగా, అదానీ పోర్ట్స్ & సెజ్‌ 1.2% పెరిగింది. ACC ఎటువంటి మార్పు లేకుండా డే క్లోజ్‌ చేసింది.