అమరావతి భూముల కేసులో కీలక మలుపు తిరిగే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. నారాయణ కుమార్తె ఇంట్లో రెండు రోజులుగా సోదాలు చేస్తున్న సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. నారాయణ, తన కుమార్తెతో మాట్లాడిన ఆడియో క్లిప్ లభించినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ భావిస్తోంది.
అమరావతి భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే 2020లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు రిజిస్టర్ చేసిన అధికారులు విడతల వారీగా దర్యాప్తు స్పీడ్ పెంచుతున్నారు. చాలా రోజుల తర్వాత గత రెండు రోజులుగా నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు చేస్తున్నారు. నారాయణ కుమార్తెతోపాటు వారి బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.
రెండు రోజులగా చేస్తున్న తనిఖీల్లో కీలకమైన ఫోన్ ఆడియో దొరికిందని తెలుస్తోంది. నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఈ సంభాషణ జరిగినట్టు సమాచారం. మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
రెండు రోజులుగా ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబుస్, కొండాపూర్‌లోని కోళ్ల లగ్జరియా విల్లాస్‌లోని నారాయణ, ఆయన కుమార్తె ఇళ్లలో తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే సీఐడీ విచారణ చేస్తోంది. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు గతంలోనే నారాయణతోపాటు పలువురు ఇళ్లలో తనిఖీలు చేశారు ఇప్పుడు నారాయణ కుమార్తె ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.
అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు , కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ 2020లో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ పేర్లను కూడా చేర్చారు. ఆ కేసుపై తాజాగా గతేడాది ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తునకు రావాలంటూ నోటీసులు అందజేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే దళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థర్డ్ పార్టీ కింద కేసు నమోదు చేశారు. అప్పుడే ఈ అంశంపై దుమారం రేగింది.