హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్శిటీలో విద్యార్ధి సంఘాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. మొన్నీ మధ్య బీసీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనపై గొడవ జరిగింది. ఇప్పుడు మరోసారి గొడవలు మొదలయ్యాయి.
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. వర్శిటీలోని త్వలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం విద్యార్థి సంఘాలు ఘర్షణలకు దిగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి.
రెండు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల మధ్య ఈ ఘర్షణపూరిత వాతావరణం కనిపిస్తోంది. రాత్రి కూడా ఇలాంటి ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందిన విద్యార్థులు గాయపడ్డారు. వివాదం గురించి సమాచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు. ఇరు వర్గాలను సర్ది చెప్పి పరిస్థితి చక్కదిద్దారు.
ఏపీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు పరస్పర దాడులకు దిగారని పోలీసులు తెలిపారు. ఘటనపై ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసినట్టు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని... ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కొంతమంది పోలీసులను అక్కడే ఉంచామన్నారు. మరిన్ని గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
హెచ్‌సీయూలో ఉన్న గిరిజనల విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థులపై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు దాడులు చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు ఏబీవీపీ నాయకులు. కత్తిలాంటి పదునైన ఆయుధాలతో దాడులు చేశారని పోలీసులకు తెలిపారు. తమ కార్యకర్తలపై జరిగిన దాడులను తాము ఖండించామని అన్నారు.
పురుషుల హాస్టల్ ఎఫ్ వద్ద ఏబీవీపీకి చెందిన విద్యార్థులు గలాటా చేశారని... తమ వర్గం వారిని విచక్షణరహితంగా కొట్టారని ఆరోపిస్తున్నారు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు. ఫుల్‌గా తాగి వచ్చిన వాళఅలు... తమను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని బూతులు తిట్టారని చెబుతున్నారు. వాళ్లు దాడి చేసి తమ హాస్టల్ గ్లాస్ డోర్‌ను పగులగొట్టారన్నారు. ఆ గ్లాస్ డోర్ పగలడం వల్ల గాజు పెంకులు గుచ్చుకొని తమ కార్యకర్తలు గాయపడ్డారని వివరించారు. వాళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితులో ఉన్నందునే ఏబీవీపీ దాడులు చేస్తోందని ఆరోపిస్తున్నారు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు. విద్యార్థులను రెచ్చగొట్టి భయపెట్టి తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు ఎవరూ వారి ట్రాప్‌లో పడొద్దని అందరూ ఐక్యంగా ఉండి ఏబీవీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచిస్తున్నారు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు.