TS Weather : హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా... మధ్యాహ్నం తేలికపాటి వర్షం కురిసింది. కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలకు కాస్త బ్రేక్ పడింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వాతావరణ చల్లపడింది. వికారాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. శీతల దేశాల్లో కనిపించే దృశ్యాలు వికారాబాద్ రోడ్లపై కనిపించాయి. వడగండ్లు అధికంగా కురువడంతో రోడ్లు మొత్తం మంచు దుప్పటితో కప్పినట్లు కనిపించాయి.  వికారాబాద్ జిల్లా మర్పల్లిలో వడగళ్ల వాన కురిసింది. అరగంట పాటు భారీ వర్షం, వడగండ్ల వానకు రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి.   ములుగు జిల్లా గోవిందరావుపేటలో వడగండ్ల వాన పడింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు వడగండ్ల వాన కురుస్తుంది. 



దట్టమైన మబ్బులు 


హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గురువారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై చీకటి కమ్ముకుంది. నగర వ్యాప్తంగా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు హడలిపోతున్నారు. అలాంటి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో హైదరాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో  ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు.   


ద్రోణి ప్రభావం 


 జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.


పలు జిల్లాలో వర్షాలు 


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలు సహా నిజామాబాద్‌, జగిత్యాల, హన్మకొండ, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్‌,  జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మార్చి 17న ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. శనివారం  (మార్చి 18) పెద్దపల్లి, కరీంనగర్‌, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, ఆదిలాబాద్‌, హన్మకొండ, కామారెడ్డి, ములుగు, నిజామాబాద్‌, జగిత్యాల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వెదర్ బులెటిన్ లో తెలిపారు.