Spicejet Pilots:


స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌లో ఘటన..


విమానం నడపడం అంత ఈజీ కాదు. ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు కంట్రోల్‌ సెంటర్‌తో కమ్యునికేట్ అవ్వాలి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నో గమనించుకోవాలి. ఇంత అప్రమత్తంగా ఉండాల్సిన పైలట్‌లు కాక్‌పిట్‌లో కూర్చుని విమానం నడుపుతూ స్నాక్స్ తింటే..? మరీ అంత నిర్లక్ష్యంగా ఉంటారా అన్న అనుమానం అక్కర్లేదు. Spicejet ఎయిర్‌లైన్స్‌లో ఇదే జరిగింది. హోళి రోజున ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న ఫ్లైట్‌లోని పైలట్‌లు కాఫీ, స్నాక్స్ తిన్నారు. అక్కడితో ఆగకుండా వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా గ్రహించిన అధికారులు వెంటనే ఇద్దరి పైలట్‌లను విధుల నుంచి తొలగించారు. కాక్‌పిట్‌లో తినడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాక్‌పిట్‌లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచినా, వాటిని తిన్నా నేరంగానే పరిగణిస్తామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు. అందరూ ఈ రూల్‌ని కచ్చితంగా అనుసరించాలని అన్నారు. 






విచారణ..


విచారణ పూర్తయ్యాక పైలట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకూ వాళ్లను విధుల నుంచి తొలగించారు. కాఫీ గ్లాస్‌ను కన్సోల్‌పై ఉంచారని, ఒక్క చుక్క దానిపై పడినా ఎయిర్‌ క్రాఫ్ట్‌కు భారీ డ్యామేజ్ జరిగే ప్రమాదముందని వివరించారు స్పైస్‌జెట్ ప్రతినిధులు. దాదాపు 37 వేల అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు ఇలాంటి సాహసాలు చేయడమేంటని మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్రమత్తమైన DGCA విచారణకు ఆదేశించింది. పండుగను జరుపుకోవాల్సిన తీరు ఇది కాదని తేల్చి చెప్పింది. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని అసహనం వ్యక్తం చేసింది.  


ఫ్లైట్‌లో సిగరెట్..


ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఈ మధ్య యూరినేషన్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాత కంపెనీ అలెర్ట్ అయింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. దీనిపై ఇంకా చర్చ జరుగుతుండగానే మళ్లీ వార్తల్లో నిలిచింది Air India. 
లండన్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఓ 37 ఏళ్ల వ్యక్తి బాత్‌రూమ్‌లో సిగరెట్‌ తాగడం కలకలం రేపింది. రమాకాంత్‌ అనే వ్యక్తి సిగరెట్ తాగడమే కాకుండా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కంపెనీ ఫిర్యాదుతో ముంబయి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఫ్లైట్‌లో సిగరెట్‌ తాగేందుకు అనుమతి లేదని, చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అందరినీ ఇబ్బందికి గురి చేశాడని ఎయిర్ ఇండియా సిబ్బంది వెల్లడించింది.


"ఫ్లైట్‌లో స్మోకింగ్‌కు అనుమతి లేదు. కానీ ఆయన బాత్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించారు. వెంటనే అలారం మోగింది. మేమంతా అలెర్ట్ అయ్యి బాత్‌రూమ్‌ వైపు వెళ్లాం. ఆయన చేతిలో సిగరెట్ ఉంది. మేం ఆ సిగరెట్‌ను లాగేసుకుని పారేశాం. ఇలా చేసినందుకు ఆయన మాపై అరవడం మొదలు పెట్టాడు. ఏదో విధంగా నచ్చజెప్పి ఆయన సీట్‌లో కూర్చోబెట్టాం. కాసేపటి తరవాత ఉన్నట్టుండి లేచి ఫ్లైట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అది చూసి తోటి ప్రయాణికులంతా భయపడిపోయారు. మేం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. గట్టిగా అరుస్తున్నాడు. చేసేదేమీ లేక మేము ఆయనను గట్టిగా పట్టుకుని చేతులు కాళ్లు కట్టేశాం. మళ్లీ కుర్చీలో బలవంతంగా కూర్చోబెట్టాం"