తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇంటిదొంగలే మోసం చేశారని సాక్షాత్తు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గోడు వెల్లబోసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రక్షాళన మొదలుపెట్టింది. కమిషన్‌లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్ శ్రీకారం చుట్టింది. కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్ భావిస్తోంది.
ఉద్యోగుల పనితీరు, వ్యక్తిత్వం తదితర అంశాలను పరిశీలనలోకి తీసుకుంటుంది. వారికి కొత్తగా అప్పగించబోయే బాధ్యతలు, తక్కువ సమయంలోనే ఆ పనిలో ప్రావీణ్యం సాధించేందుకు ఏం చేయాలి? వంటి అంశాలపై కమిషన్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. టీఎస్‌పీఎస్సీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే కొందరు ఉద్యోగులకు ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి అంతర్గతంగానే బదిలీ చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపైనా చర్చిస్తున్నది. నేడో, రేపో అంతర్గత బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
'డేటా' సెక్యూరిటీపై మరింత నిఘా..
టీఎస్‌పీఎస్సీలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కమిషన్ భావిస్తోంది. ముఖ్యంగా డేటా సెక్యూరిటీపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఉన్నదానికంటే మరింత పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం సైబర్ సెక్యూరిటీ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్‌వాల్ తదితర అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే చర్యలపై దృష్టి పెట్టింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో మరింత పకడ్బందీగా సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్‌వర్డ్స్, యూజర్ ఐడీల భద్రత తదితర అంశాలపై సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు? ఉద్యోగులను కలవడానికి ఎవరైనా వస్తున్నారా? తదితర అంశాలపై దృష్టి సారించనుంది. కార్యాలయంలోని కంప్యూటర్లకు అసలు పెన్‌డ్రైవ్ యాక్సెస్ లేకుండా చేయడం, ప్రింటింగ్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రదేశాలకే పరిమితం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో సంస్థ ఉద్యోగులెవరూ తప్పుచేయకుండా, కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం లేకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది.
సైబర్ భద్రతపై ఉద్యోగులకు శిక్షణ..
కార్యాలయ ఉద్యోగులకు సైబర్ భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగులకు సైబర్ భద్రత, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్లు హ్యాక్ కాకుండా ఎలా వ్యవహరించాలి? కఠినమైన పాస్‌వర్డ్స్‌ను ఎలా పెట్టుకోవాలి? తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ను రంగంలోకి దింపారు. ప్రతిరోజు విధులకు ఆటంకం కలగకుండానే ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.
అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ రద్దు
ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షపై బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి మార్చి 14న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజా నిర్ణయం వెలువడింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..