వంటకాలకు రుచి రావాలన్నా, మురికిపట్టిన స్టవ్ క్లీన్ చేయాలన్నా, వంటగదిలోని చెక్క సామాను శుభ్రం చేయాలన్నా, పాత్రలపై పేరుకుపోయిన మొండి జిడ్డు మాడిపోయిన గిన్నెలు శుభ్రం చేయాలన్నా.. కావలసింది ఒక్కటే. అదే వైట్ వెనిగర్. ఎన్నో ఏళ్ల నుంచి వైట్ వెనిగర్ ని వంటల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆడవాళ్ళు కిచెన్ శుభ్రం చేసుకోవాలని అనుకుంటే దీన్ని తప్పకుండా వినియోగిస్తారు. మీ పని చాలా సులభతరం చేసే ఈ యాసిడ్ వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయ్.
ఊరగాయ
మీకు భోజనం చేసేటప్పుడు ఊరగాయ లేనిదే ముద్ద దిగడం లేదా? అయితే సింపుల్ వెనిగర్ తో ఊరగాయ చేసేసుకోవచ్చు. కేవలం నిమిషాల్లోనే తయారు చేసుకుని ఎప్పుడైనా తినొచ్చు. వైట్ వెనిగర్ బాటిల్ లో చిటికెడు ఉప్పుతో పాటు మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ వంటి తరిగిన కూరగాయలు వేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేయండి. దాన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది.
సాస్ లో వేసుకోవచ్చు
బయట మార్కెట్లో దొరికేవి కాకుండా ఇంట్లోనే రుచికరమైన సాస్ తయారుచేసుకోవాలనుకుంటే వెనిగర్ తో మంచి ట్విస్ట్ ఇవ్వవచ్చు. సాస్ కి ఇది మంచి రుచిని ఇస్తుంది. వైట్ సాస్ తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో కొంచెం వైట్ వైన్, వైట్ వెనిగర్ కలిపితే వంటకు అదనపు రుచి ఇచ్చినట్టే.
గ్రీజు మరకలు వదిలించేయొచ్చు
బాగా మాడిపోయిన, జిడ్డు కలిగిన పాత్రలు శుభ్రం చేసుకోవడానికి వైట్ వెనిగర్ సూపర్ గా పని చేస్తుంది. ఎటువంటి జిడ్డు,మురికి వస్తువులు అయినా వైట్ వెనిగర్ తో క్లీన్ చేస్తే మెరిసిపోతాయి. కేవలం వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని గ్రీజు, జిడ్డు పాత్రలపై వేసి రుద్దాలి. కాసేపు నానబెట్టిన తర్వాత సాధారణ లిక్విడ్ వాష్ తో కడిగేయాలి. అంతే ఎంతటి మురికి అయినా చిటికెలో పోతుంది. మీ చేతులకు శ్రమ కూడా తగ్గుతుంది.
స్టవ్ దగ్గర గోడలు శుభ్రం చేయొచ్చు
వెనిగర్ మీ వంటగదిని ప్రకాశవంతం చేస్తుంది. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని దాంట్లో వైట్ వెనిగర్, లిక్విడ్ డిటర్జెంట్, ఉప్పు, నిమ్మరసం కలపాలి. దాన్ని స్టవ్ వెనుక ఉన్న గోడల మీద స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతటి జిడ్డు అయినా ఈజీగా పోతుంది.
అప్లయన్సేస్ క్లీనింగ్
కాఫీ మేకర్, మైక్రోవేవ్, ఫ్రిజ్ వంటి ఉపకరణాలు శుభ్రం చేసుకోవచ్చు. ఎటువంటి అవాంతరాలు లేకుండా వైట్ వెనిగర్ ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో వైట్ వెనిగర్, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కాఫీ మేకర్ లో పోసి శుభ్రం చేసుకోవచ్చు. ఆ నీటిలో స్పాంజ్ ముంచి ఫ్రిజ్, మైక్రోవేవ్ ను తుడుచుకోవచ్చు. తర్వాత వాటిని మళ్ళీ పొడిగా ఉన్న వస్త్రంతో తుడిచేస్తే మురికి అంతా పోతుంది. ఎన్నో రోజులుగా పేరుకుపోయిన మురికి, దుమ్ము, ధూళిని క్షణాల్లో వదిలించేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ‘బుల్లెట్ ప్రూఫ్’ కాఫీ గురించి మీకు తెలుసా? ఇది ‘బరువు’ భారాన్ని దించేస్తుందట!