ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. గురువారం జరిగే కౌంటింగ్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఓటింగ్ కావడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు.


9ఎమ్మెల్సీ స్థానాలకు


ఏపీలో మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్, 3 లోకల్ బాడీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమగోదావరి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బ్యాలెట్ విధానంలో జరిగిన పోలింగ్ కావడంతో కౌంటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా బ్యాలెట్ పేపర్ల పరిశీలన జరుగుతుంది.ఇతర ఎన్నికలకు భిన్నంగా జరిగే ఓటింగ్ కాబట్టి ముందుగానే చెల్లని ఓట్లను పక్కకు పెట్టివేస్తారు. బ్యాలెట్ పేపర్లో 1,2,3 వంటి నంబర్లకు బదులు టిక్ మార్క్ పెట్టినా, రోమన్ నంబర్లు లేదా A,B,C వంటి అక్షరాలు వేసినా వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. ఇక మిగిలిన ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకుని ఒక కోడ్ ప్రకారం కౌంటింగ్ జరుగుతుంది.


ఒక్క ఓటు విలువ 100


సాధారణంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఒక ఓటర్ వేసే ఓటు విలువ ఒకటిగా ఉంటుంది. అదే ఒకే చోట రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరిగితే ఒక్కో ఓటు విలువ 100గా పరిగణిస్తారు.అంటే పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో ఒక్కో ఓటు విలువ 100గా లెక్కకడతారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఒక స్థానానికి అయితే మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను సగం చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన విలువను బట్టి గెలుపును నిర్ణయిస్తారు. రెండు స్థానాలు ఉన్నచోట అంటే పశ్చిమగోదావరి లో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను మూడు భాగాలుగా చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన విలువను ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఇలా మొదటి ప్రాధాన్యత ఓటును నిర్దేశిత కోటాను చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. ఒకవేళ నిర్దేశిత కోటాను గనుక చేరుకుంటే ఆ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. బ్యాలెట్ ఓటింగ్ కావడం,కొన్ని చోట్ల అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉనదంటున్నారు అధికారులు.


పకడ్బందీగా పోలింగ్ నిర్వాహణ...


రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాలు కలుపుకుని మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు మూడు పట్టభద్రుల నియోజక వర్గ స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు రెండు ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాలకు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించారు. అనంతపూర్, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు స్థానిక సంస్థల నియోజక వర్గ స్థానాలకు వైఎస్సార్సిపి అభ్యర్థులు మినహా ఇంకా ఏ ఒక్కరూ ఈ స్థానాలకు పోటీ చేయకపోవడంతో వైఎస్సార్సిపి అభ్యర్థులు ఏకగ్రీవ ఎంపికైన్లటు ప్రకటించారు. 


అనంతపూర్ స్థానిక సంస్థల నియోజక వర్గానికి ఎస్.మంగమ్మ, కడప స్థానిక సంస్థల నియోజకవర్గాని రామసుబ్బారెడ్డి, నెల్లూరు నియోజకవర్గానికి మురళీధర్, తూర్పుగోదావరి నియోజక వర్గానికి కుడిపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గానికి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు.