హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో మ్యాన్ హోల్‌లో పడి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మ్యాన్ హోల్‌లోకి దిగి శుభ్రం చేస్తుండగా బయటికి రాలేక చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే, శుభ్రం చేసేందుకు వీరు రాత్రి వేళ మ్యాన్ హోల్‌లోకి దిగారు. మొత్తం నలుగురు వ్యక్తులు మ్యాన్ హోల్‌లోకి దిగగా.. తొలుత ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతణ్ని కాపాడేందుకు మరో వ్యక్తి లోనికి వెళ్లగా మరో వర్కర్ కూడా కనిపించలేదు. రాత్రి నుంచి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా.. శివ అనే జీహెచ్ఎంసీ కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో వ్యక్తి కోసం మ్యాన్ హోల్ లోపల గాలిస్తున్నారు.
నిజానికి మ్యాన్ హోల్‌లోకి దిగి శుభ్రం చేసేందుకు రాత్రి వేళ అనుమతి లేదు. కానీ, ఆ ప్రాంత కాంట్రాక్టర్ బలవంతం చేయడంతోనే తొలుత నలుగురు జీహెచ్ఎంసీ కార్మికులు మ్యాన్ హోల్‌లోకి దిగారు. అనంతరం లోపల శివ అనే వ్యక్తి చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అతణ్ని కాపాడేందుకు అనంతయ్య అనే వ్యక్తి ప్రయత్నించి కనిపించకుండా పోయాడు. రాత్రి నుంచి సహాయ కార్యక్రమాలు జరుగుతుండగా.. బుధవారం ఉదయానికి శివ మృతదేహాన్ని అగ్నిమాపక, మున్సిపల్ సిబ్బంది బయటికి వెలికితీశారు. ప్రస్తుతం లోపలే చిక్కుకొని ఉన్న అనంతయ్య కోసం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శివ మృతదేహాన్ని బయటకు తీయగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
తాజా ఘటనలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే జీహెచ్ఎంసీ కార్మికులు చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వేళ మ్యాన్ హోల్ శుభ్రం చేసే అవసరం ఏంటని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.
హైదరాబాద్‌లో రోడ్లు చిన్నపాటి వర్షాలకే అధ్వానంగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో ఓ ఆటో కూడా పడిపోయిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఎంతో మంది వాహనదారులు వర్షాకాలం సమయంలో మ్యాన్ హోల్స్‌లో పడి బలైన వారు ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: KCR Visit Vasalamarri Live: వాసాలమర్రికి కేసీఆర్.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష
Also Read: Nalgonda: తెలంగాణలో డేరాబాబా.. తనతో లైంగికంగా కలిస్తే శక్తులు వస్తాయంట.. అబ్బో కథ పెద్దదే