బలహీనతలను ఆసరాగా చేసుకుని దొంగ బాబాలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాలు బయటకి వస్తున్నా.. నమ్మే వాళ్లు నమ్ముతున్నారు.. మోసపోతున్నారు.  ఇలానే ఓ బురిటీ బాబా ఏకంగా 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెటుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేస్తుంటే.. ఇంకా చాలా విషయాలు బయటపడుతున్నాయి.


కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. బీటెక్‌ వరకు చదివాడు. అనంతరం సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టాడు. అది సరిగా నడవక.. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. కంపెనీని మూసివేశాడు. అనంతరం  నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అజ్మాపురంలో సాయి మాన్సి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడు. తన పేరు విశ్యచైతన్యబాబాగా చెప్పుకొన్నాడు. విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌నూ ప్రారంభించాడు. ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేశాడు.


అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే.. అమావాస్య, పున్నమికి వస్తే ప్రత్యేక పూజలు చేసి సమస్యలు తీరుస్తా అని తెగ ప్రచారం చేసుకున్నాడు. ఈ విషయాన్ని చాలామందే నమ్మారు.  ఏపీకి చెందిన ఓ మహిళ అతడిని నమ్మింది. గుడి నిర్మిస్తానని చెప్పాడు. కోటి రూపాయల వరకూ విరాళంగా తీసుకున్నాడు. అసలు గుడి అనే విషయాన్ని పక్కన పెట్టాడు. ఈ విషయంపై ఆ మహిళకు అనుమానం వచ్చింది. వెళ్లి నల్గొండ ఎస్పీ రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేసిన తనిఖీల్లో దొంగబాబా ఆశ్రమంలో చాలానే ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ బాబాను అరెస్టు చేశారు.


లైంగికంగా కలిస్తే తనలోని శక్తులు వస్తాయని మహిళలను విశ్వచైతన్య నమ్మించాడని తేలింది. మాయమాటలతో మహిళలను ట్రాప్ చేసి వీడియో కాల్స్ చేసేవాడు. బురిడీ బాబా నుంచి రూ.26 లక్షల నగదు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు  నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అతని రెండో భార్య సుజితపైనా రూ.1.30 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నట్లు వెల్లడించారు.


 మరో విషయం ఏంటంటే.. ముగ్గురు వీఐపీలు, ఇద్దరు టీవీ ఆర్టీస్టులను బురిటీ కొట్టించినట్లు తెలుస్తోంది.  ఈ దొంగ బాబాకు విదేశాల్లోనూ భక్తులు ఉన్నారట.


అరెస్ట్ సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్‌ బాండ్లు, లాప్‌టాప్‌లు, ప్రవచన పుస్తకాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. బురిడీ బాబా.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.