ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన అమరరాజా పరిశ్రమను తమిళనాడుకు తరలిస్తున్న అంశంలో ప్రభుత్వం తరపున సలహాదారు  సూటిగా స్పందించారు. అమరరాజా వెళ్లడం కాదు... తాము వెళ్లిపొమ్మంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  ప్రభుత్వం తరపున మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్‌రాజా తరలింపు అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన .. . తామే దణ్ణం పెట్టి "వెళ్లిపొమ్మంటున్నామని" నేరుగా చెప్పేశారు. అమరరాజాతో ఉద్యోగులకు.. స్థానికులకు తీవ్రమైన సమస్యలు వస్తున్నాయని చెప్పారు.  అమర రాజా సంస్థ కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం  క్షీణిస్తోందని..అది విష తుల్యమైన పరిశ్రమ అని ఆయన అన్నారు.  ఈ విషయాన్ని హైకోర్టు కూడా చెప్పిందని సజ్జల మీడియాతో వ్యాఖ్యానించారు. 


అయితే రాజకీయాలకు.. అమరరాజా సంస్థతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కేవలం పొల్యూటెడ్ అయినందునే... దండం పెట్టి తాము.. వెళ్లి పొమ్మని చెబుతున్నామని అంటున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ప్రజల ఆరోగ్యం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు.  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ ... వాహనాలకు అవసరమైన బ్యాటరీలు, ఇన్వర్టర్ బ్యాటరీల తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీగా ఉంది. అమరాన్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులు అమ్ముతూంటారు. భవిష్యత్ లో అంతా లిథియం ఆయాన్ బ్యాటరీల హవా నడుస్తుందన్న ఉద్దేశంతో.. చిత్తూరులో వాటికి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని అనుకున్నారు. 


ఇప్పుడు ఆ ప్లాంట్‌ను తమిళనాడులో పెట్టేందుకు అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పారిశ్రామిక వర్గాల్లో ప్రచారం జరగడం సంచలనం సృష్టించింది. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తేలికగా తీసుకున్నట్లుగా ఉందని.. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లోనే అర్థమవుతోంది. విభజన తర్వాత ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉంది. పారిశ్రామికీకరణ జరిగితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. అయితే అనూహ్యంగా ప్రస్తుత ప్రభుత్వం.. తామే పరిశ్రమల్ని దండం పెట్టి వెళ్లిపొమ్మని చెబుతున్నామని ప్రకటించడం...  సంచలనంగా మారింది. 


అమరరాజా సంస్థ ద్వారా కొన్ని వేల మంది చిత్తూరు జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం పదిహేను వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని చెబుతున్నారు.  అమరరాజా కంపెనీ ఇష్యూ  రాజకీయంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది. అమరరాజా కంపెనీ ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తరలింపుఅంశం కానీ.. తమిళనాడులో ప్లాంట్ పెట్టాలనుకున్న అంశంపైనా స్పందించలేదు. కానీ రాజకీయంగా మాత్రం దుమారం రేగుతోంది.