KCR Visit Vasalamarri Live: వాసాలమర్రిలో కేసీఆర్, ఇంటింటికీ కాలినడకన.. సర్పంచ్ ఇంట్లో భోజనం
యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి రోజుల్లోనే రెండోసారి వస్తున్నారు. గతంలో వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మార్చుతానని సీఎం ప్రతినబూనిన సంగతి తెలిసిందే.
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కాలినడకన ఇంటింటికీ కేసీఆర్ వెళ్లారు. దళిత బంధు వస్తే ఏం చేస్తారని, ఆ డబ్బులను ఎలా ఉపయోగిస్తారని గ్రామ ప్రజలను ప్రశ్నించారు. మధ్యాహ్నం సర్పంచ్ ఆంజనేయులు ఇంట్లో భోజనం చేశారు. దళితవాడలో పర్యటన అనంతరం కాసేపట్లో కేసీఆర్ రైతు వేదిక భవనం వద్దకు వెళ్లనున్నారు. అక్కడ ప్రజలతో సీఎం ముఖాముఖి మాట్లాడతారు.
దళితవాడలో పర్యటించిన సీఎం కొన్ని ఇళ్ల ముందు ఆగి వారి ఆర్థిక స్థితి వివరాలను ఆరా తీశారు. ఇంటి యజమానులు ఎవరని అడిగారు. ఈ సందర్భంగా తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కావాలని లబ్ధిదారులు సీఎంకు మొరపెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. గ్రామంలోని దళితవాడలో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్న 60 కుటుంబాల వారు ఒక దగ్గరికి చేరి కేసీఆర్‌ను కలుసుకున్నారు. అక్కడ వాళ్ల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. సీఎం రెండోసారి తమ ఊరికి వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు.
దళిత వాడలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాలినడకన పర్యటించనున్నందున అక్కడి ప్రజలు తమ ఇళ్ల ముందు అందంగా అలంకరించారు. ముగ్గులు వేసి సీఎంకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎం పర్యటనకు సంబంధించి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. వాసాలమర్రి గ్రామానికి సీఎం ఉదయం 11.30కు చేరుకోనున్నారు. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ముందు దళితవాడల్లో కాలినడకను పర్యటిస్తారు. దళిత వాడల్లోని ప్రజలతో మాట్లాడతారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ అయిన పోగుల ఆంజనేయులు ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి నేరుగా రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై మాట్లాడతారు.
Background
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వచ్చారు. కొద్ది రోజుల క్రితమే సీఎం కేసీఆర్ ఈ గ్రామంలో గ్రామస్తులందరితో కలిసి మధ్యాహ్న విందు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన గ్రామ సభలో సీఎం మాట్లాడుతూ.. వాసాలమర్రిని మరో ఏడాదిలో బంగారు వాసాలమర్రి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఆ గ్రామాన్ని బాగు చేసే వరకూ తాను నిద్రపోబోనని.. కనీసం మరో 20 సార్లయినా వాసాలమర్రికి వస్తానని కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే మళ్లీ కేసీఆర్ వాసాలమర్రికి వచ్చారు. సీఎం పర్యటన వేళ గ్రామంలో ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -