TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కాంట్రాక్టర్-పేకాట ఆరోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేల్చుకున్నారు. సభలో నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చ జరిగే సమయంలో ఇరువురు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఒక కాంట్రాక్టర్ అని మంత్రి తలసాని అనడంతో కోమటి రెడ్డి ఆగ్రహం ఊగిపోయారు. "నేను కాంట్రాక్టర్ అయితే పేకాడే వ్యక్తి మంత్రిగా ఉండొచ్చా అధ్యక్షా అని" కోమటిరెడ్డి అన్నారు. సింగరేణిపై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. ఇరిగేషన్(Irrigation), సింగరేణి(Singareni)లో అవినీతి జరగలేదని నిరూపిస్తే మంత్రుల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిపై పోసుకుంటానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. కోమటిరెడ్డి(Komatireddy) క్షమాపణలు చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి(Rajagopalareddy) వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. 



మంత్రి కేటీఆర్ ఆగ్రహం 


మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌(KTR) మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపై రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్న ఆయన, రాజగోపాల్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 



సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలు 


రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజకీయంగా తలపడలేక తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అవినీతిపై ప్రశ్నిస్తుంటే కాంట్రాక్టర్‌ అని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్‌గా ఉండటం తప్పా అది తప్పుడు వ్యాపారమా? అని ప్రశ్నించారు. తన కాంట్రాక్టులను అడ్డుకున్నా అధికార పార్టీకి లొంగలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలు దిగుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు రూ.లక్షల కోట్లు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt) కమీషన్లు దోచుకుంటుందన్నారు. సింగరేణిలో రూ.20 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రజలు ఆలోచించి కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.