ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Govt ) ఏర్పాటు చేయాలనుకున్న కొత్త జిల్లాలకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త జిల్లాల ప్రకటన రాజ్యాంగ విరుద్దమంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ( AP HighCourt ) ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. కొత్త జిల్లాల ప్రకటన నిలుపుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తుది ప్రకటన రానందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. అయితే అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  గుంటూరు జిల్లాకు ( Guntur ) చెందిన దొంతినేని విజయకుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెజ్జి సిద్ధార్థం, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామరావులు  ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రపతి ఆమోదముద్ర లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని పిటిషన్‌ వేశారు. 


54 వేల జనాభాలో 90 మంది మరణించడం సహజమే-జంగారెడ్డిగూడెం ఘటనపై సీఎ జగన్



ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విభజన చట్టంలో గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు గుర్తు చేశారు. ఆర్టికల్ 371 డి, ఏపీ విభజన చట్టం సెక్షన్ 97కు విరుద్ధనివారు వాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై ఉద్దేశించిన ఆరు సూత్రాల ప్రణాళికకు , రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వుల చట్టం 1975కు వ్యతిరేకం అన్నారు.  అలాగే కొత్త జిల్లాలతో స్థానికత స్వరూపం మారిపోతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్లు మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని  రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించనంతవరకూ..కొత్త జిల్లాల విభజన సాధ్యం కాదన్నారు.  


కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారు-సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్



అయితే జిల్లాల విభజనపై ప్రభుత్వం ఇంకా తుది నోటిఫికేన్ జారీ చేయలేదు. వచ్చే నెల రెండో తేదీ నుంచి కొత్త జిల్లాలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగుల కేటాయింపు.. కార్యాలయాలు సిద్ధం చేయడం వంటి  పనులు చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలన చేస్తున్నారు. తర్వాత పూర్తి స్థాయి ప్రకటన చేయనున్నారు. తుది నోటిఫికేషన్ తర్వాత జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. హైకోర్టు పిటిషన్‌పై విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసినందున అప్పటికి కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. పిటిషనర్ల అభ్యంతరాలపై అప్పటికీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆ తర్వాత విచారణ కీలకం కానుంది.