Nara Lokesh On Ysrcp : ఏపీలో జంగారెడ్డిగూడెం(Jangareddigudem) మరణాలు రాజకీయ చర్చకు దారితీశాయి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం జంగారెడ్డిగూడెం మరణాలపై వివరణ ఇచ్చింది. ఆ మరణాలన్నీ సహజ మరణాలే అని సీఎం జగన్(CM Jagan) స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చనిపోయింది నలుగురే అనే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష టీడీపీ(TDP) విమర్శలు చేసింది. ఇవాళ సభలో జంగారెడ్డిగూడెం మరణాలపై మాట్లాడాలని టీడీపీ ఎమ్మెల్యేలు(Mla) పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని ముందు నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకున్నారని స్పీకర్ ఐదుగురు టీడీపీ సభ్యులను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోలా బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్ ను సభ నుంచి మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు.   


నారా లోకేశ్ చిట్ చాట్ 


జంగారెడ్డిగూడెం మరణాలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్(Nara Lokesh) మీడియా పాయింట్ వద్ద విలేకరులతో చిట్ చాట్ చేశారు. "బాబాయ్ పై గొడ్డలిపోటుని గుండెపోటు అని శవరాజకీయం చేసింది జగన్ రెడ్డి. ఇప్పుడు కల్తీ సారా మరణాలను సహజ మరణాలు అంటున్నారు. కల్తీసారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయింది. శవరాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ రెడ్డి. జంగారెడ్డిగూడెంలో మనకు తెలిసి చనిపోయింది 25 మందే,  తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలి. మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా?. వివేకాకి హత్య చేయించింది అబ్బాయి అని తేలిపోయింది. ఇక తేలాల్సింది ఏ అబ్బాయ్ అని." లోకేశ్ అన్నారు. 


మద్యపాన నిషేధం ఏమైంది : లోకేశ్ 


జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం(Illecit liquor) వల్ల సుమారు 25 మంది చనిపోయారని వైద్యులు అంటున్నారని లోకేశ్ ఆరోపించారు. కానీ ప్రభుత్వం ఆ సంఖ్యను తొక్కిపెట్టి కేవలం నలుగురే చనిపోయారని తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. మద్యం వల్ల చనిపోయారని ప్రభుత్వం ఒప్పుకుందని, అయితే ఏ చర్యలు చేపడుతున్నారని ప్రశ్నించే తమకు ఉందని లోకేశ్ అన్నారు. వైసీపీ సర్కార్ మద్యంపై వస్తున్న రాబడితో ప్రభుత్వా్న్ని నెట్టుకొస్తుందని లోకేశ్ అన్నారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధిస్తామని చెప్పిన సీఎం జగన్ మాటతప్పారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రూ.6,500 కోట్లు మద్యం అమ్మకాలపై ఆదాయం వస్తే, ఇటీవల బడ్జెట్ లో ప్రభుత్వమే మద్యంపై రూ.22,000 వేల కోట్లు వచ్చాయని పేర్కొందన్నారు.