వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భర్త , ఏపీ సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ( Brother Anil ) ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా నిర్వహిస్తున్న సమావేశాలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఆయన విశాఖలో  ( Vizag ) బీసీ,క్రిస్టియన్, ఎస్సీ సంఘాల నాయకులతో  సమావేశం అయ్యారు. మేఘాలయ హోటల్‌లో ఈ సమావేశం జరిగింది. ఇటీవల విజయవాడలో క్రిస్టియన్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినప్పుడు కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. అంతర్గత సమావేశంలో బ్రదర్ అనిల్ ఈ మాట చెప్పారంటూ బీసీసంఘాల నాయకులు మీడియాతో చెప్పారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ప్రచారాన్ని ఖండించారు. అయినా ఆయన సమావేశాలు కొనసాగిస్తూండటంతో రాజకీయ ఎజెండా ఉందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. 


"పార్టీ" ఉద్దేశం లేకపోతే "రాజకీయ భేటీలు" ఎందుకు ? బ్రదర్ అనిల్ పార్టీ ఖాయమేనా ?


విజయవాడ మీటింగ్ లో బ్రదర్ అనిల్ ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ గెలుపు కోసం పని చేసిన వర్గాలు.. క్రిస్టియన్లు కూడా ఆవేదనతో ఉన్నారని చెబుతున్నారు. వారి బాధలు వినేందుకు తాను సమావేశాలు పెడుతున్నట్లుగా చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్న జగన్‌తో విభేదించి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వారి మధ్య మాటలు కూడా లేవు. ఈ క్రమంలో బ్రదర్ అనిల్ ఏపీలో పర్యటిస్తూ వైఎస్ఆర్‌సీపీ విజయం కోసం పని చేసిన వారితో సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది.


వైసీపీ గెలుపు కోసం పని చేసినవారు ఆవేదనతో ఉన్నారు, సీఎం జగన్ పాలనపై బ్రదర్ అనిల్ షాకింగ్ కామెంట్స్


వెైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( Sharmila ) ...తెలంగాణతో పాటు ఏపీలోనూ రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నట్లుగా కొంత కాలంగాప్రచారం జరుగుతోంది. ఆ ప్రక్రియను బ్రదర్ అనిల్ చేస్తున్నారన్న అనుమానం వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల్లో ఉంది. మత ప్రచారకునిగా బ్రదర్ అనిల్ ఎన్నికలకు ముందు ఎస్సీ, క్రిస్టియన్, బీసీ సంఘాలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి వైఎస్ఆర్‌సీపికి ఓటు వేయమని ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆ పరిచయాలతోనే కొత్తగా సమావేశాలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. బ్రదర్ అనిల్‌కు పార్టీ పెట్టే ఆలోచన ఉందని.. అన్ని సమావేశాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని.. అప్పటి వరకూ పెదవి విప్పరని భావిస్తున్నారు.